ప్రభుత్వం మొండివైఖరి వీడాలి

25 Jul, 2015 01:50 IST|Sakshi
ప్రభుత్వం మొండివైఖరి వీడాలి

♦ కార్మికులకు కనీస వేతనాలు అందించాలి
♦ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్
 
 వికారాబాద్ : కనీస వేతనాలు ఇవ్వాలంటూ కార్మికులు, ఉద్యోగులు సమ్మెలు, పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, సీఎం కేసీఆర్ మొండివైఖరి వీడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.  సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, డ్వామా ఉద్యోగులకు భరోసా కల్పించేందుకు 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం వికారాబాద్‌కు చేరుకుంది. ఇక్కడి ఎన్టీఆర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడారు. దళిత, బడుగు, బలహీన వర్గాలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు.

పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు, ఈజీఎస్ సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వకుండా వారిని అన్యాయం చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో పేద దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామన్న కేసీఆర్.. ఆ మాటే మరిచిపోయారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సమ్మె చేస్తే పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

 ప్రభుత్వంపై తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు. వికారాబాద్ మండలంలోని గిరిగేట్‌పల్లి గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామం కొట్టంగుట్ట తండాలో ఫారెస్ట్ అధికారులు రైతుల పొలాలపై దాడులు చేయడం దారుణమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలమల్లేష్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కేజీ రామచంద్రన్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం దొరల రాజ్యంగా మారిందని, హక్కుల అడగరాదని అడ్డుకోవాలని మంత్రులు చెప్పటం నియంత పోకడలకు నిదర్శనమన్నారు.

అంతకు ముందు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌పీ, సీపీఐ (ఎంఎల్) ఎంసీపీఐ రాష్ట్ర నాయకులు ఎర్రగడ్డ సాయిబాబా, భూతం వీరన్న, బి. బాబు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వి.రాములు, జిల్లా కార్యదర్శి సి. వెంకటేశ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌రావు, న్యూడెమోక్రసీ నాయకులు రహీం, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి.మల్లేశ్, అశోక్, ఎం.వెంకటయ్య, నాయకులు మహిపాల్, మహేందర్, గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాల్‌రాజ్, రత్నం, ఈజీఎస్ ఉద్యోగ సంఘం నాయకులు అశోక్, చంద్రశేఖర్, సీపీఐ, ఎంసీపీఐ డివిజన్ నాయకులు గోపాల్‌రెడ్డి, జంగయ్య పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు