పాల దిగుబడిని పెంచుకోండిలా..!

27 Nov, 2014 23:16 IST|Sakshi

సాధారణంగా 12 గంటల వ్యవధిలో పాలు పితుకుతుంటారు. చలికాలంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం 6 గంటలనుంచి 7 గంటల మధ్య, సాయంత్ర 4గంటల నుంచి 5గంటల మధ్య పాలు పితకడం మంచిది.

శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం అదనపు ఆహారం అందజేయాలి. లేకపోతే పశువు మేత సరిగ్గా తినక పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది.
పశువులకందించే దాణలో పిండి పదార్థాలు అధికంగా, మాంసకృతులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
  లూసర్న్‌వంటి పశుగ్రాసం సాగు చేపట్టి పశువులకు అందజేస్తే పాల దిగుబడి అధికంగా ఉంటుంది.
 వరికోతలు పూర్తవగానే మిగిలిఉన్న తేమతో జనుము వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి.
 శీతాకాలంలో  ఎక్కువగా పశువులకు ఎదకు వచ్చి పొర్లుతాయి. పశువులను కనీసం రెండుమూడు సార్లైన ముందుభాగం, వెనుక భాగం పరిశీలించాలి. వెనుక భాగం పరిశీలిస్తే మూగ ఎదలో ఉన్న పశువులను గుర్తించడానికి వీలవుతుంది.
 
గత ఎద పూర్తయిన తర్వాత 16-25 రోజుల వ్యవధిలో పశువుల ప్రవర్తనలో మార్పులు గుర్తించాలి. పాల ఉత్పత్తిలో తగ్గుదలను బట్టి ఎదను గుర్తించాలి. వెంటనే వీర్యదానం చేయించాలి.
 
చలిగాలులు, మంచుకురవడం వల్ల పశువులకు న్యూమోనియా సోకే ప్రమాదం ఉంటుంది. గొంతువాపు, గిట్టలు మెత్తబడటం, మేత తినకపోవడం తదితర సమస్యలు  ఉత్పన్నమవుతాయి.
 పశువులను, దూడలను ఆరుబయట కట్టేయకూడదు. ఈదురు గాలులు నివారించడానికి వాతవరణంలో ఉష్ణాగ్రత 10 డిగ్రీల కంటే తక్కువైన సందర్భాల్లో పశువుల పాకలకు పరదాలు కట్టాలి.
 లేగదూడల వెంట్రుకలు చలికాలంలో కత్తిరించకూడదు.
 రోజూ రెండుసార్లు పశువుల పాకలను శుభ్రం చేయాలి. సోడా, కార్బోనెట్, 10 శాతం బ్లీచింగ్ పౌడరు వంటి క్రిమి సంహారక మందులు వాడాలి.
 నీటి తొట్టెలను వారానికోసారి శుభ్రం చేయాలి. వాటికి తరచూ సున్నం వేస్తుండటం మరవద్దు. దీంతో పశువులకు కావాల్సినంత కాల్షియం, ఖనిజ లవణాలు లభ్యమవుతాయి.
 పశువులకు రోజుకు 50 నుంచి 60 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో రెండుమూడు సార్లు నీరు అందజేయాలి. తాగేందుకు నీరు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది.
 పాలు పితకడానికి రెండు గంటల ముందు, పితికిన తర్వాత మరో గంటకు పశువులకు దాణ ఇవ్వాలి.

మరిన్ని వార్తలు