కొత్త ప్రభుత్వంతో పనిచేయించాలి

30 May, 2014 02:16 IST|Sakshi

కాగజ్‌నగర్ రూరల్/తాండూర్, న్యూస్‌లైన్ : ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వమే కదా అని ఊరుకోకుండా ప్రభుత్వంతో పనిచేయించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గురువారం కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం హెచ్‌ఆర్‌డీ హాల్‌లో తెలంగాణ జేఏసీ, విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘భవిష్యత్ తెలంగాణలో మన కర్తవ్యం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని సాధారణ ప్రజలకు అభివృద్ధి ఫలాలు దక్కేలా చూడాలని పేర్కొన్నారు.

 ఆంధ్రా పాలకులు కుట్రలు చేస్తున్నారు..
 రాష్ట్ర ఏర్పాటు చివరి దశలో ఢిల్లీలో ఆంధ్రాపాలకులు ఎన్నో కుట్రలు పన్నారని, రాష్ట్రం ఏర్పడిన వారి కుట్రలు కొనసాగుతున్నాయన్నారు. పోలవరంలోని ముంపు మండలాలను ఆంధ్రాలో కలపుతూ హడావుడిగా ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు కుట్ర ఫలితంగానే ఇదంతా జరుగుతోందన్నారు. భద్రాచలంలోని ఆదివాసీల అభిమతం పరిగణలోకి తీసుకోకుండా ఆంధ్రాలో కలపడం అప్రజాస్వామ్యమన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసానని చెబుతున్న చంద్రబాబు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులనే అభివృద్ధి చేశారన్నారు.

గతంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఇక్కడ పుష్కలంగా వ్యాపారాలు జరిగేవని, రామగుండం, పెద్దపల్లి, కాగజ్‌నగర్‌లను కలుపుతూ పారిశ్రామిక కారిడార్‌గా ఏర్పాటు చేస్తూ నిజాం సర్కారు రైల్వేమార్గం ఏర్పాటు చేసిందన్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారానే ఉపాధిమార్గాలు పెంపొందుతాయన్నారు. ఆ దిశగా తెలంగాణ పునఃర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు కోదండరాంను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేధిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురిజాల రవీందర్, జిల్లా అధ్యక్షుడు సంజీవ్, జేఏసీ తాలుకా కన్వీనర్ వజ్జల కిశోర్‌కుమార్, టీవీవీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం విస్తారు, కమల్, జిల్లా ఉపాధ్యక్షుడు దొంతి లింగారెడ్డి, రవీందర్, మధుసూధన్, జేఏసీ నాయకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, జాకిర్, బాబన్న, సంతానం, తెలంగాణవాదులు పాల్గొన్నారు.
 
 విలువలతో కూడిన విద్య బోధించాలి..
 కార్పొరేట్ విద్యావ్యవస్థల్లో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ విద్యాబోధన జరుగుతోందని, విలువలతో కూడిన విద్యా బోధనందించాలని కోదండరాం అన్నారు. గురువారం పట్టణంలో సుప్రభాత్ స్కూల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు చారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాల, ఇంటర్‌లో ఒత్తిడికి గురి చేయడం ద్వారా తరువాత విద్యార్థులు పక్కదారి పడుతున్నారన్నారు. అనంతరం తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గణపురం మురళి, టౌన్ ఎస్‌హెచ్‌వో రవికుమార్, మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, కాగజ్‌నగర్, దహెగాం ఎంఈవోలు దేవాజీ, స్వామి, ప్రముఖ వైద్యులు శ్రీనివాస్, అనిత, జేఏసీ కన్వీనర్ కిశోర్‌కుమార్, బీజేపీ నాయకుడు అమర్‌సింగ్ తిలావత్, నాయకులు సత్యనారాయణ, లింగారెడ్డి, పురుషోత్తమచారి, శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
 
 గిరిజనులకు అన్యాయం చేస్తే సహించం..
 తెలంగాణలోని అమాయక గిరిజనులకు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడితే సహించబోమని కోదండరాం హెచ్చరించారు. గురువారం తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులతో కలిసి తాండూర్‌కు వచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలవరంపై కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాల ప్రభుత్వాలతో చర్చలు జరిపి అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఒక ప్రాంతానికే మద్దతు తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఆందోళనలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.  ఆయన వెంట గురిజాల రవీందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు రవి, పీఓడీఈటీ ఉపాధ్యక్షులు సంతోష్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమల్, జిల్లా కో-కన్వీనర్ పురుషోత్తం, సభ్యులు తొగరి శ్రీనివాస్, బాపన్న, మధుసూదన్, శశికుమార్, సుధాకర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు