వ్యాపారుల చూపు.. ఖమ్మం వైపు..

7 Jun, 2014 03:22 IST|Sakshi
వ్యాపారుల చూపు.. ఖమ్మం వైపు..

రాష్ట్ర విభజనతో తరలిరానున్న వ్యాపార సంస్థలు
పెద్ద వ్యాపార కూడలిగా మారనున్న ఖమ్మం!

 
జిల్లాకు మహర్దశ పట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా జిల్లా అభివృద్ధి చెందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వ్యాపార, విద్య, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో మంచి పేరున్న  జిల్లా కేంద్రమైన ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందనే  చర్చ ప్రస్తుతం  వ్యాపార వర్గాల్లో  నడుస్తోంది. ఇప్పటివరకు విజయవాడ కేంద్రంగా జరిగిన వ్యాపారమంతా ఇక నుంచి ఖమ్మం కేంద్రంగా జరుగుతుందని.., పన్నుల మినహాయింపుతో పాటు, తెలంగాణలోని నాలుగైదు జిల్లాలకు కూడలిగా ఖమ్మం ఉండడమే దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 రాష్ట్ర విభజన నేపథ్యంలో  వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల చూపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో  ఉన్న ఖమ్మం జిల్లాపై పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటి వరకు అన్ని రకాల వ్యాపారానికి కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడకు దీటుగా జిల్లాలో వాణిజ్య సంస్థలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి కనబరుస్తున్నారు.   ఇప్పటికే కార్పోరేట్ వ్యాపార సంస్థలు  రాగా, ఇప్పుడు హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు కూడా జిల్లాపై కన్నేశారు. దీంతో రానున్న కొద్ది కాలంలోనే విజయవాడకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత ఖమ్మం అతిపెద్ద వ్యాపార కూడలి అయ్యే అవకాశం కనిపిస్తోంది.

 అన్ని రకాలుగా అనువైన ప్రదేశం...

 ఇప్పటివరకు జిల్లాకు సంబంధించిన అన్ని రకాల వ్యాపారాలు విజయవాడ ఆధారంగా జరిగాయి.   ముంబై, కోల్‌కతా, సూరత్‌ల్లోని వస్త్ర పరిశ్రమల కేంద్రాలతో విజయవాడ వ్యాపారులకు సంబంధాలున్నాయి. అక్కడి ఏజెన్సీలు విజయవాడలో ఉన్నాయి. ఉత్పత్తులు ముందుగా ఏజెన్సీలు, హోల్‌సేల్ షాపులకు వస్తాయి. అక్కడి నుంచి ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల హోల్‌సేల్, రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తారు. వీటితోపాటు అల్యూమినియం, ఇత్తడి, స్టీలు, ఇనుప వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఆటోమొబైల్, ఇతర ఆటవస్తువులు, కుటీర, మధ్యతరగతి పరిశ్రమల విడిభాగాలు, ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్), ఫ్యాన్సీ, కిరాణ, చెప్పులు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులు విజయవాడ హోల్‌సేల్ మార్కెట్‌లో లభిస్తాయి. విజయవాడ వన్‌టౌన్, కాళేశ్వరరావు మార్కెట్,  వస్త్రలత, ఆటోనగర్, బీసెంట్‌రోడ్డు, నెల్లూరురోడ్డు, బందర్‌రోడ్డు ప్రాంతాల్లో జరిగే ఈ వ్యాపారంలో సగానికి పైగా క్రయవిక్రయాలు తెలంగాణ జిల్లాల వారే చేస్తారు.

ప్రతిరోజు సుమారు రూ. 10కోట్ల మేరకు విజయవాడ నుంచి తెలంగాణ ప్రాంతాలకు వ్యాపారం జరుగుతుంది. ఇలా సీజన్, అన్‌సీజన్‌తో కలుపుకొని నెలకు సుమారు రూ. 300 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నడుస్తాయి. ఇందుకోసం ఒక్క ఖమ్మం నగరానికే ప్రతిరోజు సుమారు 100 మందికి పైగా గుమస్తాలు, వ్యాపారులు ఆర్డర్లు తీసుకునేందుకు వస్తారు. ఇలా తెలంగాణ జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్న వ్యాపార సంస్థలతో విజయవాడ కేంద్రంగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌రాష్ట్రంగా ఉన్నప్పుడు మామూలుగానే వ్యాపారం సాగేది. ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఇరు రాష్ట్రాల మధ్య వ్యాపార లావాదేవీల పన్నులు, వాహనాల టాక్స్‌లు వగైరా చెల్లింపులుంటాయి.

మరిన్ని వార్తలు