ఇల్లెందు ఎమ్మెల్యేకు షోకాజ్

21 Oct, 2014 02:47 IST|Sakshi

పార్టీ ఫిరాయింపుపై వివరణ కోరిన
శాసనసభ కార్యదర్శి
స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన జానారెడ్డి


సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పార్టీ ఫిరాయింపుపై  షోకాజ్ నోటీస్ జారీ అయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరిన కనకయ్యపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలంటూ తెలంగాణ శాసనసభ కార్యాలయ కార్యదర్శి నోటీస్‌జారీ చేశారు. పార్టీ మారిన రెండు నెలల తర్వాత ఈ నోటీస్ రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇల్లెందు నియోజకవర్గం నుంచి గెలిచిన కోరం కనకయ్య ఆ తర్వాత కొద్ది నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు, అభివృద్ధి పట్ల ఆకర్షితుడినయ్యానంటూ టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీనుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. పార్టీలోని సీనియర్ నేతలు ఈ అంశంపై విమర్శలు చేయకపోవడంతో కనకయ్య టీఆర్‌ఎస్‌లో చేరడంపై పార్టీనుంచి ఎవరికీ పెద్దగా వ్యక్తిగత అభ్యంతరాలు లేవన్న అభిప్రాయం అప్పట్లో కలిగింది.

అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి అధికార పార్టీలో చేరిన పలు జిల్లాల శాసనసభ్యులతోపాటు కనకయ్యకు శాసనసభ కార్యదర్శి నోటీస్ జారీ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలంటూ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి అధికారికంగా ఫిర్యాదు ఇవ్వడంతో..ఈనోటీసు జారీ చేసినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం వరకు ఇల్లెందులోనే ఉన్న కనకయ్య నోటీస్ జారీ కాగానే హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు.

మరిన్ని వార్తలు