వరాల జల్లు

19 Jan, 2015 04:13 IST|Sakshi
వరాల జల్లు

మురికివాడల్లో సమస్యలపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆరాతీశారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి మౌలిక వసతులు మెరుగు పరుస్తానని హామీఇచ్చారు. దశలవారీగా స్లమ్‌ఏరియాలను అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. బస్తీల్లో సమస్యలను తాను స్వయంగా చూశానని, ఇబ్బందులు తీరుస్తానని భరోసా ఇచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాత పాలమూరు హరిజనవాడ, పెద్దచెరువు, పాతతోట, వీరన్నపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పట్టణవాసులకు వరాలజల్లు కురిిపిస్తూ.. ముందుకు సాగారు.         
               - సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
 
 పాలమూర్ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు పట్టణ ప్రజలకు హామీఇచ్చారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ మైదానంలో పట్టణ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. పాలమూర్ ఎంపీగా ఉన్నప్పు డే తెలంగాణ రాష్ట్రం సాధించానని, కీర్తి ప్రతిష్టలు చరిత్రలో నిలబడతాయన్నారు.

మరో రెండుమూడు వారాల్లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. అందుకోసం తాను స్వయంగా వస్తానన్నారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలు ఒక్కదగ్గరకు వస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు స్థలపరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ జనాభాకు తగిన విధంగా పట్టణరోడ్లు సరిపోవడం లేదని, పట్టణరోడ్డుకు అనుసంధానంగా మరో బైపాస్‌రోడ్డు నిర్మాణం జరగాలన్నారు. షాషాబ్‌గుట్ట, పెద్ద చెరువు, భూత్పూర్ రోడ్డు, రాయిచూర్ రోడ్డును కలుపుతూ రోడ్డును నిర్మిస్తామని చెప్పారు. అందుకోసం రూ.7కోట్లు మంజూరుచేస్తున్నట్లు వెల్లడించారు.
 
హైజెనిక్ పద్ధతిలో మార్కెట్
 జిల్లా కేంద్రంలో మార్కెట్లు దుర్భరంగా ఉన్నాయని, అత్యాధునిక పద్ధతిలో కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్ల నిర్మిస్తామని సీఎం అన్నారు. రూ.5 కోట్లతో ఐదుమార్కెట్లు నిర్మించేందుకు నిధులు మంజూరుచేస్తున్నట్లు చెప్పారు. ఆర్‌అండ్‌బీ ఈఈ కార్యాలయం ఆవరణలో, బాలుర జూనియర్ కళాశాల వద్ద, భగీరథ కాలనీలో, తూర్పుకమాన్, కమలానెహ్రుకాలనీ మార్కెట్లను నిర్మిస్తామన్నారు. ఇందులో కింద కూరగాయల మార్కెట్, పైభాగంలో మాంసం మార్కెట్, చేపల మార్కెట్ ఉండే విధంగా వీటిని నిరిస్తామని చెప్పారు.
   
పట్టణ ప్రజల సౌకర్యార్థం మరోరైతు బజార్‌ను నిర్మిస్తామని సీఎం చెప్పారు. ఆర్‌అండ్‌బీ కార్యాలయంలోని రెండెకరాల స్థలాన్ని ఇందుకోసం కేటాయించినట్లు పేర్కొన్నారు.
 
 స్లాటర్‌హౌస్ మంజూరు
 జిల్లా కేంద్రంలో ఓ  స్లాటర్‌హౌస్ లేదని, కోయిలకొండ చౌరస్తాలో ఓ స్లాటర్‌హౌస్‌ను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
 
పట్టణంలో ఉన్న పెద్ద చెరువును మరో ట్యాంక్‌బండ్‌గా నిర్మిస్తామన్నారు. కట్టను వెడల్పుగా చేసి అవసరమైతే భూమిని సేకరిస్తామని సీఎం చెప్పారు. ఆహ్లాదకరంగా ఉండే విధంగా పార్కును నిర్మిస్తామని, చెరువులో ఉన్న గుర్రపుడెక్కల ఆకులను పదిరోజుల్లో తొలగించాలని అధికారులను ఆదేశించారు. కట్టకింద 35 ఎకరాల ప్రభుత్వభూమి ఉందని, అవసరమైతే మరో మరికొంత భూమిని సేకరించి పార్కును నిర్మిస్తామన్నారు.
   
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా వాటర్‌గ్రిడ్ ద్వారా నీటిని అందిస్తామని సీఎం చెప్పారు. అంతవరకు ప్రజలకు మంచినీరు అందించాలనే ఉద్ధేశంతో ప్రతి 2, 3 వేల జనాభాకు ఓ మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.1.50కోట్లను మంజూరు చేశామని తెలిపారు.  
   
ప్రస్తుతం ఉన్న టౌన్‌హాల్ బాగా లేదని.. ఎప్పుడో కట్టిన హాల్ ప్రస్తుత ప్రజలకు సరిపోవడం లేదన్నారు. జిల్లా కేంద్రానికే తలమానికంగా ఉండే విధంగా మహబూబ్‌నగర్ కళాభారతి పేర ఆడిటోరియం నిర్మిస్తామని సీఎం హామీఇచ్చారు.
   
జిల్లా కేంద్రంలో ఓ మెడికల్ కాలేజీ అవసరం ఉందని, కలిసికట్టుగా ఉండి సాధించుకుందామన్నారు. విద్యాభివృద్ధి కోసం పీయూను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.
 
3 కామన్‌డంపు యార్డ్
 జిల్లా కేంద్రంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం వేస్తున్నారని.. పట్టణ జనాభాకు తగిన విధంగా మూడు కామన్‌డంప్ యార్డులను మంజూరుచేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పట్టణాన్ని సందరంగా మార్చేందుకు ఇది దోహదపడుతుంది. జిల్లాకేంద్రంలో శ్మశానవాటికల కోసం స్థలాలు చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పట్టణంలో అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పాలమూరు జిల్లా వలసల నివారణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లికృష్ణారావు, విద్యుత్‌శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు గువ్వల బాల్‌రాజు, అంజయ్య, మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ టీకే.శ్రీదేవి, మునిసిపల్ చైర్‌ర్సన్ రాధాఅమర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యా, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు