జలసిరి ఆవిరి

5 May, 2014 03:27 IST|Sakshi
జలసిరి ఆవిరి
 •   మండే ఎండలకు త గ్గిపోతున్న నీటినిల్వలు
 •    తీవ్ర మవుతున్న పానీపరేషాన్
 •    శివార్లకు తప్పని క‘న్నీటి’ కష్టాలు
 •   జూలై చివరి వరకు ఢోకా లేదంటున్న జలమండలి
 •  సాక్షి, సిటీబ్యూరో : మండుటెండలకు గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జలాశయాలు ఆవిరవుతున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు నిత్యం 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో ఆయా జలాశయాల్లో ఆవిరయ్యే నీటి శాతం ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి ఐదు నుంచి పది శాతానికి క్రమంగా పెరుగుతోందని జలమండలి వర్గాలు అంచనా వేస్తున్నాయి. భ విష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జలమండలి పొదుపు మంత్రం పాటిస్తూ.. అరకొరగా మంచినీటిని సరఫరా చేస్తుండటంతో శివార్లలోని పలు ప్రాంతాలకు వారం పదిరోజులకోమారు సరఫరా అందుతోంది.

  ఇప్పటికిప్పుడు నగరంలో తాగునీటికి ఇబ్బంది లేకపోయినా ఎండ ల తీవ్రత, కరెంటు కోతలు పెరిగితే పానీపరేషాన్ మరింత పెరగక తప్పదన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాల్లో నీటినిల్వలు శరవేగంగా పడిపోతున్నాయని జలమండలి తాజా నివేదిక వెల్లడించింది. వివిధ జలాశయాల్లో పడిపోతున్న నీటి మట్టాలు గతేడాదితో పోలిస్తే అధికంగా ఉన్నట్లు పేర్కొంది.
   
  ఇవీ క‘న్నీటి’ కష్టాలు

  గ్రేటర్ పరిధిలో జలమండలి మంచినీటి సరఫరా 180 మిలియన్ గ్యాలన్లకు మించడం లేదు. ఈ నీటినే మహానగరం పరిధిలోని 8 లక్షల కుళాయిలకు సరిపెడుతున్నారు. సుమా రు 4 లక్షల కుళాయిలకు రెండురోజులకోమారు అరకొరగా నీళ్లందుతున్నా.. మరో నాలుగు లక్షల కుళాయిలకు వారం, పదిరోజులకోమారు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. అదీ పట్టుమని పది బిందెల నీళ్లు పట్టుకోకముందే కుళాయి ఆగిపోతోంది. దీంతో శివారు జనానికి పానీపరేషాన్ తీవ్రమౌతోంది. ట్యాంకర్ నీళ్లు, ఫిల్టర్ ప్లాంట్లను ఆశ్రయించక తప్పని దుస్థితి తలెత్తింది. పదకొండు శివారు మున్సిపాల్టీల పరిధిలోని 870 కాలనీలు, బస్తీలకు కన్నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
   
  జూలై చివరి వరకు భయం లేదు..

  ప్రస్తుతం ఆయా జలాశయాల్లో ఆవిరయ్యే నీటి శాతం సాధారణంగా నిత్యం ఐదు శాతం మేర... ఎండ తీవ్రత పెరిగిన రోజుల్లో   పదిశాతానికి పెరుగుతోందని జలమండలి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు జూలై చివరి నాటి వరకు నగర అవసరాలకు సరిపోతాయని భరోసా ఇస్తున్నాయి. అప్పటివరకు వర్షాలు కురవని పక్షంలో నీటి కష్టాలు మరింత పెరగడం తథ్యమని స్పష్టం చేస్తున్నాయి. రుతుపవనాలు కరుణించి సకాలంలో వర్షాలు కురిస్తే జలాశయాల్లో నీటి మట్టాలు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాయి.
   

మరిన్ని వార్తలు