కేశవపట్నం ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెండ్‌..? 

5 Feb, 2020 08:30 IST|Sakshi

సాక్షి, శంకరపట్నం(మానకొండూర్‌): కేశవపట్నం ఎస్సై శ్రీనివాస్‌ను సోమవారం పోలీస్‌ ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. ఆరు నెలల క్రితం జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌ నుంచి ఎస్సై శ్రీనివాస్‌ బదిలీపై కేశవపట్నం వచ్చారు. గతంలో ఇప్పలపల్లె గ్రామ శివారులో పేకాటలో పట్టుబడిన వారిలో కొందరిపై కేసు నమోదు చేసి, మరి కొందరిని కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టారు. ఈ విషయమై ‘పేకాటలో పోలీసుల చేతివాటం’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పేకాటలో పట్టుబడిన వారిలో కొందరిని విడిచిపెట్టడంతోపాటు కానిస్టేబుల్‌ రాజునాయక్‌ డబ్బులు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చా యి. సివిల్‌ తగాదాల్లో తలదూర్చి వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నా యి. శంకరపట్నం మండల సర్పంచ్‌ల ఫోరం ఎమ్మెల్యే, అధికారులకు ఎస్సై శ్రీని వాస్‌పై ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎస్సై శ్రీనివాస్, కానిస్టేబుల్‌ రాజునాయక్‌ను సస్పెండ్‌ చేస్తూ వేటు వేసినట్లు సమాచారం. కరీంనగర్‌లో పని చేస్తున్న ఓ ఎస్సైకి కేశవపట్నం ఎస్సైగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు