వీఆర్‌ఓపై ఎస్‌ఐ దాడి

17 Apr, 2020 12:23 IST|Sakshi
గాయాన్ని చూపిస్తున్న వీఆర్‌ఓ, రెవెన్యూ సిబ్బంది అంటూ బైక్‌పై అతికించి ఉన్న స్టిక్కర్‌

వాతలు వచ్చేలా కొట్టిన పోలీసు అధికారి

నేడు విధుల బహిష్కరణకు రెవెన్యూ ఉద్యోగుల పిలుపు

యాలాల: కోవిడ్‌ విధుల్లో భాగంగా వెళుతున్న ఓ వీఆర్‌ఓను ఎస్‌ఐ లాఠీతో కొట్టాడు. ఈ సంఘటన  ఇందిరమ్మ కాలనీ సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది.  బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కోకట్‌ గ్రామ వీఆర్‌ఓ ఆంజనేయులు విధుల్లో భాగంగా ఆర్‌ఐ వెంకటేశ్‌ ఆదేశం మేరకు గురువారం సాయంత్రం 6 గంటల  కు ఖాంజాపూర్‌  గేటు వద్దకు బైక్‌పై వెళుతున్నాడు. అయితే ఇందిరమ్మ కాలనీ వద్ద యాలాల పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద కానిస్టేబుళ్లు బైక్‌ను ఆపారు. కంటైన్‌మెంట్‌ జోన్‌గా ఉన్న ఇందిరమ్మ కాలనీ పరిధిలో ఎందుకు వచ్చారని కానిస్టేబుళ్లు అడగగా, తాను ఇందిరమ్మ కాలనీ పరిధిలోకి వచ్చే కోకట్‌ గ్రామ వీఆర్‌ఓనని ఆంజనేయులు సమాధానమిచ్చారు.

అయితే హడావుడిలో ఐడీ కార్డు తీసుకురాలేదని, తన ఐడీ కార్డుకు సంబంధించిన వివరాలు ఫోన్‌లో ఉన్నాయని కానిస్టేబుళ్లకు వివరించాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన యాలాల ఎస్‌ఐ– 2 రమేష్‌ వీఆర్‌ఓను లాఠీతో కొట్టాడు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన వీఆర్‌ఓ జరిగిన విషయాన్ని తోటి సిబ్బంది, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఇదే విషయమై ఎస్‌ఐ విఠల్‌రెడ్డిని వివరణ కోరగా.. ఐడీ కార్డు చూపించే విషయంలో వీఆర్‌ఓ సరిగ్గా స్పందించలేదని, ఎస్‌ఐ– 2తో క్షమాపణ చెప్పిస్తామని పేర్కొన్నారు. కాగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి, ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న తమ పట్ల పోలీసులు  ఇలా వ్యవహరించడం సరికాదని యాలాల రెవెన్యూ సిబ్బంది పేర్కొన్నారు. అకారణంగా తమ తోటి ఉద్యోగిని కొట్టిన పోలీసులకు వ్యతిరేకంగా శుక్రవారం విధులకు దూరంగాఉంటామని యాలాల రెవెన్యూ సిబ్బంది తెలిపారు.

మరిన్ని వార్తలు