ఎస్సై శ్రావణ్‌కు అరుదైన అవకాశం

20 Jun, 2019 10:42 IST|Sakshi

అమెరికాలో 20 రోజుల ప్రత్యేక శిక్షణ

సాక్షి, సిటీబ్యూరో: నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్‌) సబ్‌–ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న  బి.శ్రావణ్‌కుమార్‌కు అరుదైన అవకాశం దక్కింది. అమెరికా పోలీసు విభాగం నిర్వహించిన ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు ఎంపికైన ఆయన 20 రోజుల పాటు ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందారు. ప్రధానంగా మానవ అక్రమరవాణా అరికట్టే విధానాలపైనే ఈ శిక్షణ జరిగింది. గత నెల 18న ప్రారంభమైన శిక్షణ ఈ నెల 8తో ముగిసింది. మానవ అక్రమరవాణాపై ఆ దేశం అవలంభిస్తున్న విధానాలు, చట్టాలు, పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులతో పాటు వీసా విధివిధానాలను బోధించారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీ, బోస్టన్, డల్లాస్‌ సహా మొత్తం ఏడు ప్రాంతాల్లో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది.

తదనంతర కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న శ్రావణ్‌ బుధవారం భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అభివృద్ధి చెందుతున్న 24 దేశాల్లోని పోలీసు విభాగాల నుంచి అధికారులను ఎంపిక చేయగా, భారతదేశం నుంచి ఈ శిక్షణకు ఎంపికైంది శ్రవణ్‌కుమార్‌ ఒక్కరే కావడం గమనార్హం. ప్రస్తుత ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన శ్రవణ్‌కుమార్‌ 2009లో సివిల్‌ ఎస్సైగా పోలీసు విభాగంలో అడుగుపెట్టారు. గతంలో నగర టాస్క్‌ఫోర్స్‌లోని ఉత్తర మండలంలో విధులు నిర్వర్తించిన ఆయన అనేక కీలక కేసుల్ని ఛేదించడంలో కీలకపాత్ర పోషించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన బదిలీల నేపథ్యంలో సీసీఎస్‌కు వచ్చారు.  

మరిన్ని వార్తలు