షాకింగ్ : సెటిల్‌మెంట్ చేసుకోమన్నారు!

15 Nov, 2017 13:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : 'చిల్డ్రన్స్‌ డే రోజు శివ్‌ రచిత్‌ను తయారుచేసి 8:30 కి చిరునువ్వుతో స్కూలుకు పంపించాను. రోజులాగే మా ఆయన అనిల్ రోజులాగే బాబును స్కూలు వద్ద దింపి వచ్చాడు. కానీ స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యంతో పసివాడు శవమై తేలాడంటూ' మల్కాజ్‌గిరి విష్ణుపురి కాలనీలోని బచ్‌పన్ స్కూలులో నీటి సంపులో శవమై కనిపించిన బాలుడి తల్లి విశాల తన ఆవేదన వ్యక్తం చేశారు. శివ్‌ రచిత్ మృతిపై వివరాలు అడగగా స్కూలు మేనేజ్‌మెంట్‌తో ఎంతో కొంతకు సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ ఎస్ఐ శంకరయ్య సలహా ఇవ్వడం దారుణమని బాలుడి బంధువులు పేర్కొన్నారు.

'మా పిల్లల గురించి అడిగే హక్కు, అధికారం మాకు లేదా.. అడిగేందుకు మాకు బాధ్యత లేదా.  మేం స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తామంటే.. ఆ ప్రశ్నలేవో మాకే రాసివ్వండి. మేం వారిని అడుగుతామని ఎస్ఐ అన్నారు. ప్రశ్నలు రాసివ్వడానికి అసలు ఇది స్కూలు పరీక్షలా.. సీసీ కెమెరాలు రెండు రోజుల నుంచి పనిచేయలేదన్నారు. బాలుడు ఆడుకుంటూనే నీటిలో పడిపోయాడని అంత ఈజీగా ఎలా గుర్తించారు. 150 మంది పిల్లలకు ఆరుగురు ఆయాలున్నారని చెబుతున్నారు. నీటి కోసం తెరిస్తే.. ఆ తర్వాత మూయకుండా అలాగే వదిలేస్తే పిల్లల ప్రాణాలకు ప్రమాదమని తెలియదా. అయినా నీటి సంపు పక్కనే చిన్న పిల్లల్ని ఆడుకోనివ్వకూడదని కూడా విద్యార్థుల పేరెంట్స్, బంధువులే చెప్పాలా' అంటూ వారు ప్రశ్నించారు.

పరారీలో స్కూలు యాజమాన్యం
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని పేరెంట్స్, బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో భయాందోళనకు గురైన బచ్‌పన్ స్కూలు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. శివ్ రచిత్ తల్లిదండ్రులు మాత్రం బాబు కోసం కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికులను సైతం ఈ విషాదం కలిచివేస్తోంది.

మరిన్ని వార్తలు