‘ఎస్సై’ రాతపరీక్ష ఫలితాలు విడుదల

17 Sep, 2018 01:20 IST|Sakshi

     58.70 శాతం మంది ఉత్తీర్ణత

     దేహదారుఢ్య పరీక్షలకూ ఆన్‌లైన్‌ దరఖాస్తులే 

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన  ఎస్సై (సివిల్‌) ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 1,217 పోస్టులకుగాను ఈ ఏడాది ఆగస్టు 26న జరిగిన రాతపరీక్షకు 1,77,992 మంది హాజరు కాగా, అందులో 1,10,635 మంది ఉత్తీర్ణత సాధించినట్టు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు ఆదివారం వెల్లడించారు. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను దిద్దిన అనంతరం సగటు మార్కులను 72.8గా నిర్ధారించామని, అత్యధికంగా 151 మార్కులు, అత్యల్పంగా 8 మార్కులు వచ్చాయని వెల్లడించారు. మోడల్‌ మార్కుగా నిర్ధారించిన 69 మార్కులను 4,776 మంది అభ్యర్థులు సాధించారని తెలిపారు.

దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాతో పాటు అర్హత పొందని వారి జాబితాను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయి వివరాలు చూసుకోవచ్చని వెల్లడించారు. పార్ట్‌–2 దరఖాస్తుల ప్రక్రియ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులంతా www.tslprb.in అనే వెబ్‌సైట్‌ ద్వారా అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయడం ద్వారా పార్ట్‌–2 దరఖాస్తును నింపాల్సి ఉంటుందని తెలిపారు. కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే తేదీలను త్వరలో ప్రకటిస్తామని, ఏ రోజున ఎక్కడ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామో ఆయా లెటర్లలో వెల్లడిస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు నోటిఫికేషన్‌ నిబంధనల ప్రకారం ఒక్కసారి మాత్రమే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.  

మరిన్ని వార్తలు