నేడు ఎస్సై రాత పరీక్ష 

26 Aug, 2018 01:07 IST|Sakshi

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని నియామక బోర్డు స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాల్లోని 339 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 1,217 పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రాథమిక రాత పరీక్షకు 1,83,482 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణ సమయంలో అధికారులు, సిబ్బంది అనుసరించాల్సిన విధానాలపై బోర్డు ఇదివరకే అవగాహన కార్యక్రమం నిర్వహించింది.

హాల్‌టికెట్‌ జారీ నిబంధనలకు లోబడి పరీక్ష నిర్వహణ జరుగుతుందని తెలిపింది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌–తెలుగు, ఇంగ్లిష్‌–ఉర్దూ భాషల్లో ఉంటుందని, ఇందులో ఎలాంటి సందేహం ఉన్నా ఇంగ్లిష్‌లో పేర్కొన్న ప్రశ్నను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని వివరించింది. ఎలాంటి తప్పిదాలు లేకుండా ప్రాథమిక పరీక్ష నుంచి అభ్యర్థుల తుది ఎంపిక వరకు బయోమెట్రిక్‌ విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు బోర్డు శనివారం  తెలిపింది.   

మరిన్ని వార్తలు