సిద్దిపేట..ఉద్యమాల కోట

16 Nov, 2018 14:38 IST|Sakshi

సిద్దిపేట నియోజకవర్గ ముఖచిత్రం

తెలంగాణ ఉద్యమానికి కేరాఫ్‌

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు రాజకీయ జన్మనిచ్చిన గడ్డ

మామ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న హరీశ్‌రావు

తొలి దశ ఉద్యమ నేత మదన్‌మోహన్‌ ప్రాతినిధ్యం వహించింది ఇక్కడి నుంచే

1970 నుంచి ఈ ముగ్గురివే వరుస విజయాలు

ఉద్యమాల పురిటి గడ్డగా,  ప్రజాచైతన్యానికి వేదికగా  సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకుంది.  తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతంలో ఉప్పెనల ఎగిసింది. ఈ గడ్డపై పుట్టిన అనేక మంది కళాకారులు తమ ఆటా, పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. మలిదశ తెలంగాణ పోరాట రథ సారథి, స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ ఓనమాలు నేర్పిన గడ్డ సిద్దిపేట. తెలంగాణ ప్రజా సమితితో తొలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన అనంతుల  మదన్‌మోహన్‌  రాజకీయ ప్రస్థానం సాగింది కూడా ఇక్కడి నుంచే.  మదన్‌ మోహన్‌ అనంతరం కేసీఆర్, ప్రస్తుతం హరీశ్‌రావుకు వరుస విజయాలను అందించి ఆశీర్వదించారు ఇక్కడి ప్రజలు. 1970 నుంచి 2014 వరకు ఈ నియోజవర్గానికి జరిగిన 15 ఎన్నికల్లో ఈ ముగ్గురే విజేతలుగా నిలవడం విశేషం. రాజకీయ చైతన్యం తొనికిసలాడే సిద్దిపేట నియోజకవర్గంపై ప్రత్యేక కథనం..    


 సాక్షి, సిద్దిపేటజోన్‌: నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 19 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అత్యధికంగా ఐదు సార్లు ఉప ఎన్నికలు జరగడం విశేషం. 1969లో తొలివిడత తెలంగాణ ఉద్యమ సమయంలో 1970  ఉప ఎన్నిక తర్వాత మలివిడత ఉద్యమంలో వరస రాజీనామాలతో 2001, 2004, 2008, 2010లో ఉప ఎన్నికలు జరిగడం విశేషం. తెలంగాణ ప్రజా సమితితో ఉద్యమానికి తొలివిడతలో తెరలెపిన అనంతుల మదన్‌మోహన్‌తో పాటు ఆయన వద్ద రాజకీయ శిష్యరికం పొందిన ప్రస్తుత టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్‌రావుకే నియోజకవర్గ ప్రజలు వరసగా పట్టం కట్టారు.

1983లో గురువు మదన్‌మోహన్‌పై పోటి చేసి ఓటమి చెందిన కేసీఆర్‌ 1985నుంచి వరుసగా డబుల్‌ హట్రిక్‌ విజయాలు సాధించి రికార్డు నెలకొల్పారు. అనంతరం ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి హరీశ్‌రావు 2004 ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసి వరుసగా ఐదు సార్లు ఎన్నికల్లో విజయం సాధించాడు. అందులో మూడు ఉప ఎన్నికలే కావడం విశేషం. 

సిద్దిపేట నియోజకవర్గ స్వరూపం
నియోజకవర్గంలో సిద్దిపేట మున్సిపల్‌తో పాటు  సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాలు ఉన్నాయి. 
సిద్దిపేట నియోజకవర్గ  ఓటర్లు  1,97,920
మహిళలు                             98,557, 
పురుషులు                           99,337 
ఇతరులు                              26
మొత్తం పోలీంగ్‌ స్టేషన్‌లు          256
నియోజకవర్గంలోని గ్రామాలు    81

1952లో నియోజకవర్గం ఏర్పాటు..
సిద్దిపేట నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఆరుసార్లు టీఆర్‌ఎస్‌ని, నాలుగు సార్లు టీడీపీని, ఐదు సార్లు కాంగ్రెస్‌ పార్టీని, ఒక్కోక్క సారి తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్‌), ప్రోగ్రెసివ్‌ డెమోక్రెటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌), స్వతంత్రులకు పట్టంకట్టారు. నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా గెలిచిన వారిలో అనంతుల మదన్‌మోహన్, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తన్నీరు హరీష్‌రావు మంత్రులుగా పనిచేశారు. 1952లో జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి గురువారెడ్డి సమీప ప్రత్యర్ధి పీవి. రాజేశ్వరావుపై విజయం సాదించి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా రాజకీయ ముఖచిత్రంలో స్థానం సంపాదించుకున్నారు.

1957లో పీవీ రాజేశ్వర్‌రావు గురువారెడ్డిని ఓడించి ప్రతికారం తీర్చుకున్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసిన సోమేశ్వర్‌రావు, కాంగ్రెస్‌ అ«భ్యర్థి వీబీ రాజేశ్వర్‌పై విజయం సాదించారు. 1967లో వీబీ. రాజు, సీపీఎం అభ్యర్థి నర్సింహరెడ్డిపై గెలుపొందారు. 1969లో తొలి విడత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వీబీ. రాజు రాజీనామా చేశారు. 1970లో జరిగిన నియోజకవర్గ తొలి ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి పక్షాన అనంతుల మదన్‌మోహన్‌ విజయం సాదించారు. అక్కడి నుంచి ప్రారంభమైన మదన్‌మోహన్‌ రాజకీయ ప్రస్తానం 1985 వరకు కొనసాగింది. ఈ మద్య కాలంలో ఆయన పీవీ. నర్సింహరావు, చెన్నారెడ్డి, భవనం వెంకట్‌రావు, టి. అంజయ్య, కోట్ల విజయబాస్కర్‌రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పని కొనసాగారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ప్రతిపక్షనేతగా కూడా వ్యవహరించారు. 

1983లో ప్రారంభమైన కేసీఆర్‌ ప్రస్థానం
1983లో ఆవిర్భవించిన టీడీపీ నుంచి పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే రాజకీయ గురువు మదన్‌మోహన్‌ చేతిలో ఓటమి చెందిన కేసీఆర్‌ తర్వాత వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వంలో కేసీఆర్‌ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2001లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిఘటించిన కేసీఆర్‌ టీడీపీ సభ్యత్వానికి, శాసనసభకు, డిప్యూటీ స్పీకర్‌ పదవికి మూకుమ్మడి రాజీనామలు సమర్పించారు. 2001లో టీఆర్‌ఎస్‌ పక్షాన ఉప ఎన్నికల్లో గెలుపొందిన కేసీఆర్, అనంతరం 2004లో సార్వత్రిక ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేసి విజయం సాధించారు.

ఈ సమయంలోనే సిద్దిపేట ఎమ్మెల్యే పదివికి రాజీనామా సమర్పించడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో కేసీఆర్‌ మేనల్లుడు హరీశ్‌రావు నియోజకవర్గానికి 2004 ఉప ఎన్నికల ద్వారా ఆరగ్రేటం చేశారు. అప్పట్లోనే  వైఎస్‌ మంత్రి వర్గంలో హరీశ్‌ యువజన సర్వీస్‌ల శాఖ మంత్రిగా భాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవిని స్వీకరించి కొద్ది రోజులకే భారీ మెజార్టీతో సిద్దిపేట నుంచి గెలుపొందారు.  అప్పటి నుంచి 2014 వరకు ఐదు పర్యాయాలు విజయాన్ని సాదించారు. ఇటీవల ప్రభుత్వం ముందస్తుకు వెళ్లడంతో మరోసారి ఎన్నికలు అనివార్యంగా మారింది. ఇప్పటికే ఐదు సార్లు సిద్దిపేట నియోజకవర్గం నుండి విజయం సాధించిన హరీష్‌రావు డబుల్‌ హ్యట్రిక్‌ దిశగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు