సిద్దిపేటలో ఆటో వార్

15 Aug, 2015 02:22 IST|Sakshi
సిద్దిపేటలో ఆటో వార్

రెండు గంటలపాటు ఆందోళన
రాస్తారోకో.. ఆర్డీఓకు వినతి
పలు పార్టీల మద్దతు
 
 సిద్దిపేట జోన్ : ఆర్టీసీ, ఆటో వర్కర్స్ యూనియన్ మధ్య కొనసాగుతున్న వివాదం శుక్రవారం రోడ్డెక్కింది. స్థానిక పాతబస్టాండు వద్ద ఆటో స్టాండు కోసం కేటాయించిన స్థలాన్ని తమకే వదలాలని,  పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు రెండుగంటలపాటు ఆందోళన నిర్వహించారు.  సిద్దిపేట పాతబస్టాండు వద్ద పార్కింగ్ విషయంలో ఆర్టీసీ,ఆటో యూనియన్ కు మధ్య గొడవ జరిగిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని నిరసిస్తూ శుక్రవారం ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ముస్తాబాద్ చౌరస్తా వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీనితో ట్రాఫిక్ స్తంభించింది.

విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు మారుతీప్రసాద్, శ్రీనివాస్ రెడ్డిలు సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆటో డ్రైవర్లను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో పోలీసులు వాహనాలను మళ్లించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మరోవైపు ఆటోడ్రైవర్లు అక్కడినుంచి నేరుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఖాజా, ప్రధానకార్యదర్శి బాలకృష్ణ,ప్రతినిధులు భాస్కర్, యాదగిరి, బాల్‌రెడ్డి, కిషన్, చంద్రం, కనకరాజుతో పాటు వివిధ పార్టీల నాయకులు రేవంత్ కుమార్, బొమ్మల యాదగిరి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు