‘పంచాయతీ’ల్లో బీసీలకు అన్యాయం 

26 Dec, 2018 03:20 IST|Sakshi

28న కలెక్టరేట్ల ముట్టడి: ఆర్‌.కృష్ణయ్య 

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గించడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య మంగళవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 56 శాతం జనాభా గల బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా న్యాయమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో బీసీలకు 2,345 ఇవ్వడం దుర్మార్గమని, దీనిని బీసీలు క్షమించరన్నారు.   సుప్రీంకోర్టు 2010 లోనే తీర్పు ఇచ్చినా.. అనంతరం 2013–గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే అమలు చేశారని గుర్తు చేశారు. ఈ 34 శాతం రిజర్వేషన్లు గత 30 ఏళ్లుగా కొనసాగుతున్నాయని, కొత్తగా ఇప్పుడు ఎందుకు అవరోధాలు వస్తున్నాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని మోదీతో చర్చలు జరిపి పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టేందుకు కృషి చేయాలని కృష్ణయ్య కోరారు.  

ఈ నెల 28న కలెక్టరేట్ల ముట్టడి.. 
బీసీ రిజర్వేషన్లు 34 శాతంతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 28న అన్ని జిల్లా కలెక్టరేట్లు, ఆర్‌డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలను ముట్టడించి ధర్నాలు చేపట్టాలని బీసీ కుల సంఘాలకు కృష్ణయ్య పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 29న అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో కుల సంఘాలు, బీసీ సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. బీసీలకు తగ్గించిన రిజర్వేషన్లను పెంచే వరకు పోరాటం కొనసాగుతుందని ఆర్‌. కృష్ణయ్య హెచ్చరించారు.   

మరిన్ని వార్తలు