ముందు కొడుతున్నా .... తర్వాత ఫోన్ చేయండి

4 Mar, 2015 21:04 IST|Sakshi
ముందు కొడుతున్నా .... తర్వాత ఫోన్ చేయండి

హైదరాబాద్:  పని ఒత్తిడిలో ఉన్న బ్యాంకు సిబ్బంది సంతకం సరిపోల్చి చూసుకోకుండా ఒకరి నగదు మరొకరికి ఇచ్చారు. దీంతో నగదు తీసుకున్నట్లు సెల్ఫోన్లో సందేశం రావడంతో అసలు ఖాతాదారుడు వెంటనే అప్రమత్తమై బ్యాంకుకి చేరుకుని... అధికారులను నిలదీశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలోని ఓ బ్యాంకులో చోటు చేసుకుంది. ఆలంపల్లికి చెందిన లంక లక్ష్మారెడ్డి నగదు డ్రా చేసేందుకు బుధవారం బ్యాంకుకు వెళ్లారు.

కొద్దిసేపు క్యూలో నిల్చున్న ఆయన అత్యవరస పని ఉండటంతో ...  తన పాస్‌బుక్‌ను కౌంటర్‌లో ఉన్న ఉద్యోగి సలహా మేరకు ఇచ్చి ఇంటికి వెళ్లిపోయాడు. తీరా గంట తరువాత తన ఖాతా నుంచి రూ.18 వేలు డ్రా అయినట్లు లక్ష్మారెడ్డికి ఫోన్‌లో సందేశం రావడంతో వెంటనే బ్యాంకు మేనేజర్‌ను ఫిర్యాదు చేశారు.  విషయం తెలుసుకున్న మేనేజర్ నగదు డ్రా చేసిన ఓచర్ను పరిశీలించిగా... దొంగ సంతకంతో రూ. 18 వేలు డ్రా చేసినట్లు గుర్తించారు.

బ్యాంకులో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా కౌంటర్‌పై ఉన్న పాసుబుక్ తీసుకొని విత్‌డ్రా ఫాం నింపి డబ్బు డ్రా చేసిన వ్యక్తి ధారూరు మండలం ఎబ్బనూర్ గ్రామానికి చెందిన బ్యాగరి లక్ష్మణ్‌గా బ్యాంకు అధికారులు గుర్తించారు. వెంటనే అతడి ఫోన్ చేయ్యగా తాను అనంతగిరిగుట్టపై బిజీగ ఉన్నానని ...  ప్రస్తుతం మందు కొడుతున్నానని...తరువాత ఫోన్ చేయండంటూ సమాధానమిచ్చాడు. దీంతో బ్యాంకు అధికారులు అవాక్కయ్యారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు