‘గాంధీ’లో స్కిల్‌ ల్యాబ్‌

7 Mar, 2019 11:21 IST|Sakshi
స్కిల్‌ ల్యాబ్‌ నమూనా చిత్రం

రూ.2 కోట్లతో ప్రత్యేకంగా ఏర్పాటు

వైద్య సిబ్బంది నైపుణ్యం పెంచడమే లక్ష్యం

ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు రూపకల్పన

సౌత్‌ ఇండియా నోడల్‌ కేంద్రం ఇదే..

మూడు నెలల్లో అందుబాటులోకి...

గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి మరో అరుదైన మైలురాయిని అధిగమించేందుకు వేదిక కానుంది. తెలంగాణ వైద్యప్రదాయినిగా పేరుగాంచిన ఈ ఆస్పత్రిలో సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో స్కిల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకుకేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మార్చి 15వ తేదీలోగా టెండరు ప్రక్రియ పూర్తి చేసి మూడు నెలల్లో స్కిల్‌ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. సౌత్‌ ఇండియాలోని ఐదు రాష్ట్రాలకు చెందిన వైద్యసిబ్బందికి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ స్కిల్‌ల్యాబ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఇండియాకు చెందిన డాక్టర్‌ యోగేష్, ఇమ్రాన్‌ఖాన్‌ల నేతృత్వంలో ఆరుగురు నిపుణుల బృందం బుధవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించింది.

తెలంగాణ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ (డీఎంఈ) రమేష్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌లతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం..వైద్యులు, నర్సులు, వైద్య విద్యార్థులతోపాటు వైద్యసిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని మరింత పెంపొందించేందుకు స్కిల్‌ ల్యాబ్‌లో శిక్షణ అందిస్తారు. రోగిపై నేరుగా కొన్ని రకాల ప్రయోగాలు చేయలేరు. అవి వికటిస్తే రోగి ప్రాణాలకే ప్రమాదం. అందుకు ప్రత్యామ్నాయంగా మనిషి ఆకారంలో అంతే సైజులో ఉండే బొమ్మలను అంటే  ప్రాణం లేని కృత్రిమ మనుషులు స్కిల్‌ల్యాబ్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని వైద్యపరిభాషలో మ్యానిక్యూర్స్‌ అంటారు. వాటిలో కూడా రక్తప్రసరణ, గుండె కొట్టుకోవడం వంటి మనిషిలో జరిగే అన్ని జీవప్రక్రియలు జరుగుతాయి. వాటిపై వైద్యపరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించి నైపుణ్యాన్ని పెంపొందిస్తారు.

ఐదు రాష్ట్రాల వైద్యసిబ్బందికిశిక్షణ ఇక్కడే..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వైద్యసిబ్బందికి ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు సౌత్‌ ఇండియా నోడల్‌ సెంటర్‌గా స్కిల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. గాంధీ మెడికల్‌ కాలేజీకి ఆస్పత్రికి చెందిన ప్లాస్టిక్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ తదితర విభాగాలకు చెందిన కొంతమంది వైద్యులతోపాటు మరో 12 మంది ట్యూటర్లను ఎంపిక చేసి ఢిల్లీలో వృత్తి నైపుణ్యం పద్ధతులు, టీచింగ్‌ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అనంతరం వీరిని స్కిల్‌ల్యాబ్‌ శిక్షకులుగా నియమించి ఐదు రాష్ట్రాల వైద్యసిబ్బందికి శిక్షణ ఇప్పిస్తారు.

ఓపీ భవనం పైన స్కిల్‌ల్యాబ్‌...  
గాంధీ ఆస్పత్రి ఓపీ భవనంపైన స్కిల్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు వైద్యనిపుణులు, తెలంగాణ వైద్యఅధికారులు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులు నిర్ణయించారు. భవన నిర్మాణానికి రూ.కోటి, పరికరాలు, ఎక్విప్‌మెంట్, మ్యానికుర్స్‌లను కొనుగోలుకు మరో కోటి రూపాయలు వ్యయం చేస్తారు. ఇప్పటికే ప్రారంభమైన టెండరు ప్రక్రియను మార్చి 15వ తేదీతో పూర్తి చేసి, మూడు నెలల్లో స్కిల్‌ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

రూ. 2.5 కోట్లతో ఆర్‌సీఎన్‌సీ డిజాస్టర్‌ భవన సముదాయం
గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో రూ.2.5 కోట్ల వ్యయంతో రేడియేషన్, కెమికల్స్, న్యూక్లియర్‌ సెంటర్‌ (ఆర్‌సీఎన్‌సీ) డిజాస్టర్‌ భవన సముదాయాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వ వైధ్యాధికారులు బుధవారం స్థల పరిశీలన నిర్వహించారు. హైదరాబాద్‌ నగరంపై బాంబు దాడులు జరిగితే తక్షణ వైద్యసేవలు అందించేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ డిజాస్టర్‌ భవన సముదాయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. కొన్ని గంటల వ్యవధిలో భవనాన్ని నిర్మించేలా ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ బిల్డింగ్‌ విధానాన్ని అవలంబించి ఆర్‌సీఎన్‌సీ డిజాస్టర్‌ భవన సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు