నేడు ఓరుగల్లులో సింహగర్జన

10 Jun, 2018 01:08 IST|Sakshi

అట్రాసిటీ చట్టం పరిరక్షణే లక్ష్యంగా బహిరంగ సభ  

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిరక్షణే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రం ప్రకాశ్‌రెడ్డి పేటలో నిర్వహించే సింహగర్జనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 59 దళిత సంఘాలు, 31 గిరిజన సంఘాలు ఐక్యంగా ఈ సింహగర్జనను నిర్వహిస్తున్నాయి.

లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌తో పాటు జాతీయ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆదివారం సాయంత్రం 5 నుంచి 9 వరకు సభ జరగనుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని దళిత, గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.

30 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కవచంలా ఉన్న అట్రాసిటీ చట్టాన్ని రూపుమాపేందుకు కేంద్రం కుట్రపన్నిందని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సెక్షన్‌ 18కి విఘాతం కలగకుండా, సుప్రీంకోర్టు న్యాయ విచారణ జరపకుండా ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

వరంగల్‌ డిక్లరేషన్‌: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పరిరక్షించడంతో పాటు భవిష్యత్‌లో దళిత, గిరిజనుల రక్షణ కోసం రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సిన చర్యలను ఈ సభలో వరంగల్‌ డిక్లరేషన్‌ పేరుతో ప్రకటించనున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత వస్తుండటంతో పోలీసుశాఖ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది.

కేంద్ర మాజీ మంత్రులు కిశోర్‌ చంద్రదేవ్, సతీష్‌ జార్కోలి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కొప్పుల రాజు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు డి.రాజు, అంబేడ్కర్‌ మనుమడు ప్రకాష్‌ అంబేడ్కర్, అసదుద్దీన్‌ ఒవైసీ, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, చాడ వెంకట్‌రెడ్డి, బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, చెరుకు సుధాకర్, ఎల్‌.రమణ, ప్రొఫెసర్‌ కోదండరాం తదితరులు హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు