కార్పొరేట్లను రప్పించడమే అభివృద్ధా: కారత్

20 May, 2015 03:10 IST|Sakshi
మంగళవారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభలో మాట్లాడుతున్న ప్రకాశ్‌కారత్

హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం సరళీకృత ఆర్థికవిధానాలను దూకుడుగా అమలు చేస్తుండడంతో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని సీపీఎం మాజీ ప్రధానకార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఎర్రతివాచీ పరచి, వాటికి తలుపులు బార్లా తెరవడమే అభివృద్ధా.. అని ప్రశ్నించారు. మంగళవారం సీపీఎం సిద్ధాంతకర్త పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ప్రగతినగర్‌లో నిర్మించిన సుందరయ్య భవన్‌ను కారత్ ప్రారంభించారు.

అనంతరం ‘మారుతున్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులు’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, అన్ని రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. భూసేకరణ చట్టానికి సవరణల ద్వారా రైతన్నల భూమిని కంపెనీలు, సంపన్నవర్గాలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని విశాల ప్రాతిపదికన ఉద్యమాన్ని మొదలుపెడతామన్నారు.

కులవ్యవస్థను బద్ధలు కొట్టకుండా, భూ పంపిణీ చేయకుండా దేశం అభివృద్ధి చెందబోదని సీపీఎం పొలిట్‌బ్యూరోసభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. ‘ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు’పై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగం నానాటికీ తగ్గిపోతున్న  నేపథ్యంలో ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే దేశం ముందడుగు వేస్తుందన్నారు. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రసంగిస్తూ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వేల ఎకరాల భూములను తాము పేదలకు పంపిణీ చేస్తే, ఇప్పుడు వాటిని పెద్దలకు కట్టబెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 

>
మరిన్ని వార్తలు