ఏకకాలంలో రెండు  మోటార్ల వెట్‌రన్‌ 

26 Apr, 2019 00:19 IST|Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం 

రెండో మోటార్‌ స్విచాన్‌ చేసిన సీఎంవో కార్యదర్శి 

స్మితా సబర్వాల్, పెద్దపల్లి కలెక్టర్‌ శ్రీ దేవసేన 

ధర్మారం(ధర్మపురి): కాళేశ్వరం ప్రాజెక్టులో మరోకీలక ఘట్టం గురువారం ఆవిష్కృతమైంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం వద్ద ప్యాకేజీ–6లో భాగంగా నిర్మించిన సర్జిపూల్‌లోని రెండవ మోటార్‌ వెట్‌రన్‌ విజయవంతమైంది. 124.7 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే రెండో మోటార్‌ సైతం 105 మీటర్ల లోతు నుంచి నీటిని తోడి మేడారం రిజర్వాయర్‌లోకి పంపింగ్‌ చేసింది. వెట్‌రన్‌ విజయవంతం కావడంతో ఇంజనీరింగ్‌ అధికారుల్లో హర్షం వ్యక్తమైంది. రెండో మోటార్‌కు సంబంధించిన సాంకేతిక ప్రక్రియలన్నీ పూర్తికావడంతో అధికారులు గురువారం వెట్‌రన్‌కు ఏర్పాట్లు చేశారు. సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, పెద్దపల్లి కలెక్టర్‌ శ్రీ దేవసేన హాజరై మోటార్‌ వద్ద ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం ఇద్దరూ కలిసి మోటార్‌ స్విచ్‌ ఆన్‌చేసి వెట్‌రన్‌ ప్రారంభించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నీటిని లిఫ్ట్‌ చేయడంతో.. ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బందిని వారు అభినందించారు. మిగిలిన పనులు సైతం ఇదే ఉత్సాహంతో పూర్తిచేయాలని ప్రోత్సహించారు. బుధవారం మొదటి మోటార్‌ వెట్‌రన్‌ విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. 

30 నిమిషాలు వెట్‌రన్‌ 
మధ్యాహ్నం 1:45 గంటలకు రెండో మోటార్‌ను స్మితాసబర్వాల్, శ్రీ దేవసేన ప్రారంభించారు. అనంతరం వారు జేసీ వనజాదేవి, ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి సిస్టర్న్‌ల వద్దకు వచ్చారు. తర్వాత 15 నిమిషాలకు ఇంజనీర్లు మొదటి మోటార్‌ను కూడా ఆన్‌ చేశారు. కొంత ఆలస్యంగా మొదటి సిస్టర్న్‌ నుంచి నీరు ఉబికి వచ్చింది. ఏకకాలంలో రెండు మోటార్ల వెట్‌రన్‌ విజయవంతమైంది. రెండు సిస్టర్న్‌ల ద్వారా వచ్చిన నీరు గ్రావిటీ కెనాల్‌ ద్వారా సమీపంలోని మేడారం రిజర్వాయర్‌లోకి చేరింది. కాలువలో పారుతున్న గోదావరి నీటికి స్మితాసబర్వాల్, శ్రీ దేవసేన, వనజాదేవి, ఇంజనీరింగ్‌ అధికారులు పూజలు చేశారు. సుమారు 30 నిమిషాలు రెండు మోటార్లు వెట్‌రన్‌ కొనసాగించి తర్వాత ఆఫ్‌ చేశారు 

మరిన్ని వార్తలు