ముంపు నుంచి తేలిన రత్నాపూర్

29 Dec, 2015 02:47 IST|Sakshi
ముంపు నుంచి తేలిన రత్నాపూర్

ఎస్సారెస్పీలో అడుగంటిన నీరు

 బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడంతో ముంపు గ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అర్ధ శతాబ్దం క్రితం ముంపునకు గురైన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం రత్నాపూర్ గ్రామ ఆనవాళ్లు బయటపడింది. ఇదివరకే కుస్తాపూర్ రామలింగేశ్వర స్వామి ఆలయం, రత్నాపూర్ గ్రామ ఆరాధ్య దైవం మల్లన్న గుట్ట వరకు రోడ్డు మార్గం బయల్పడింది. ప్రస్తుతం ఆ గ్రామ చెరువు, ఇళ్ల పునాదులు బయట పడ్డాయి. దీంతో మల్లన్న గుట్ట వద్ద  పూజలు నిర్వహించేందుకు వస్తున్న ఆ గ్రామస్తులు  తాము నివాసం ఉన్న ఇళ్ల ఆనవాళ్లను చూసి ఆవేదన, మరోవైపు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. 

రత్నాపూర్ గ్రామంలో మల్లన్న గుట్ట చుట్టూ నివాసాలు ఉండేవని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే గుట్ట చుట్టూ  పునాదులు వరుస క్రమంలో కనిపిస్తున్నాయి. మల్లన్న గుట్టకు సమీపంలో వీరన్న గుట్ట ఉంది. ఆ గుట్ట పూర్తిగా ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైంది. ప్రస్తుతం ఆ గుట్ట పూర్తిగా బయటపడింది. అక్కడి వరకు  రోడ్డు ఉంది. రత్నాపూర్ గ్రామం మల్లన్న గుట్టకు, వీరన్న గుట్టకు మధ్యలోనే ఉందనడానికి గుర్తులు కనిపిస్తున్నాయి. అలాగే, మల్లన్న గుట్టపై ఉన్న బురుజుపై గండదీపం ముట్టించే వారని చెబుతున్నారు. బురుజుపై గండ దీపం వెలిగిస్తే ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్‌కు కనిపించేదని వృద్ధులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు