ప్రగతిలో సింగరేణి పరుగులు

12 Jan, 2019 03:25 IST|Sakshi

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మెరుగైన ఫలితాలు 

ఐదేళ్లలో అన్ని విభాగాల్లో రికార్డుస్థాయి వృద్ధి

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ అన్ని విభాగాల్లో రికార్డు స్థాయిల్లో వృద్ధిని నమోదు చేస్తూ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం (2009–14) సాధించిన బొగ్గు రవాణా, ఓబీ తొలగింపు, అమ్మకాలు, నిఖర లాభాలతో పోలిస్తే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత (2014–2019) సింగరేణి సాధించిన వృద్ధి రికార్డుస్థాయిలో ఉంది. దేశంలోనే ఎనిమిది సబ్సిడరీ కంపెనీలు గల కోలిండియా సైతం గత ఐదేళ్లలో ఇంత వృద్ధిని నమోదు చేయలేదని శుక్రవారం సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.

2009–2014 బొగ్గు రవాణాలో కేవలం 90 లక్షల టన్నుల వృద్ధిని సాధించిన సింగరేణి, ఆవిర్భావం తర్వాత 200 లక్షల టన్నుల వృద్ధిని సాధించింది. అంటే 122 శాతం వృద్ధి అన్నమాట. అలాగే ఓవర్‌ బర్డెన్‌ తొలగింపులో 250 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు నమోదు చేసి 257 శాతం వృద్ధిని సాధించింది. తెలంగాణ రాకముందు ఐదేళ్ల అమ్మకాల్లో రూ.5,600 కోట్ల వృద్ధిని నమోదు చేసిన కంపెనీ, ఆవిర్భావం తర్వాతి ఐదేళ్లలో రూ.13,000 కోట్లతో 132 శాతం వృద్ధిని సాధించడం విశేషం. అలాగే ట్యాక్సులు చెల్లించిన తర్వాత నికరలాభం కూడా భారీగా పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఐదేళ్లలో నికర లాభం 290 కోట్ల రూపాయలు ఉండగా గడిచిన ఐదేళ్లలో రూ.1,200 కోట్లుగా నమోదు చేసింది.  

నెలనెలా సమీక్షలు, తక్షణ పరిష్కారాలు 
సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తన నేతృత్వంలో సింగరేణిని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలుపుతూ నాలుగేళ్లలో అనూహ్య ప్రగతిని సాధిస్తూ వస్తున్నారు. గతంలో ఏడాదికి, ఆరు నెలలకోసారి జరిగే ఏరియా జనరల్‌ మేనేజర్ల సమీక్ష సమావేశాలను ఆయన ప్రతీనెలా నిర్వహించడం మొదలు పెట్టారు. సమావేశాల్లో ఉత్పత్తికి ఆటంకంగా ఉన్న సమస్యలను జీఎంలు వివరించినప్పుడు వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం, సంబంధిత శాఖ తక్షణ చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ చేసేవారు. దీంతో 2015–16లో ఏకంగా 15% వృద్ధి రేటు నమోదు చేసి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకే ఆదర్శప్రాయంగా నిలిపారు. పాత యంత్రాల స్థానంలో సుమారు రూ.350 కోట్లతో కొత్త యంత్రాలు కొనుగోలు చేశారు.

విద్యుదుత్పత్తిలోనూ ముందే.. 
సింగరేణి సంస్థ తమ 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ద్వారా రాష్ట్రానికి ఇప్పటివరకూ 19,036 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందించింది. అనతికాలంలోనే అత్యధిక పీఎల్‌ఎఫ్‌ సాధించిన ప్లాంటుగా జాతీయస్థాయిలో 4వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో మరో 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మించడానికి సన్నాహాలు కూడా చేస్తోంది. ఇదే కాక 12 ఏరియాల్లో మరో 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికీ పూనుకుంది. తొలి దశలో 130 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటును 2018–19లో పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించనుంది.

మరిన్ని వార్తలు