సింగరేణియులదే చైర్మన్‌ పీఠం..

10 Jan, 2020 10:50 IST|Sakshi

సాక్షి, బెల్లంపల్లి: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిసారి కార్మిక కుటుంబాల నుంచే చైర్మన్‌ (చైర్‌ పర్సన్‌)గా ఎన్నికవుతున్నారు. రాజకీయ నేపథ్యం అంతగా లేకపోయిన మున్సిపల్‌ ప్రథమ పౌరులుగా ప్రా తి నిధ్యం వహిస్తున్నారు. ఇతర వర్గాల కుటుంబాల నుంచి   ఇంత వరకు ఓటర్లు మున్సిపల్‌     పీఠాన్నీ ఎక్కించిన దాఖలాలు లేకపోవడం బెల్లంపల్లి మున్సిపల్‌ ప్రత్యేకతగా చెప్పవచ్చు. సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, కార్మికుల భార్యలు మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్‌ అవుతున్నారు. కార్మిక కుటుంబాలను ఓటర్లు ఆదరిస్తున్నారు. అందలం ఎక్కిస్తున్నారు.

బెల్లంపల్లి మున్సిపల్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికలు జరుగగా ఏడుగురు అభ్యర్థులు చైర్మన్‌గా వ్యవహరించారు. వీరంతా కార్మిక కుటుంబాల నుంచి ఎన్నిక కావడం విశేషం.   ప్రస్తుతం పుర ప్రజల దృష్టంతా చైర్మెన్‌ అభ్యర్థిపైనే కేంద్రీ కృతమై ఉంది. ఈదఫా ఎన్నికల్లో ఓటర్లు ఎవరిని ఆదరించి చైర్మెన్‌ సీటులో కూ ర్చోబెడతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈక్రమంలో ఓటరు మహాశయులు  గత చరిత్రను పున:రావృతం చేస్తారా  లేదా కొత్త ఒరవడికి శ్రీకారం చూడుతారా  అనేది తేలాల్సి ఉంది.

కార్మిక కుటుంబాలకే ఆదరణ...
బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్మెన్‌గా కార్మిక కుటుంబాలకు చెందిన వ్యక్తులే ఎన్నికవుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మున్సిపాలిటీకి ఇప్పటి వరకు ఆరు సార్లు  ఎన్నికలు జరిగాయి. ఏడుగురు మున్సిపల్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి రాణించారు. ప్రప్రథమంగా 1987లో బెల్లంపల్లి మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సింగరేణిలో మైనింగ్‌ సర్దార్‌గా పనిచేస్తున్న ఇరిగిరాల చంద్రశేఖర్‌ (టీడీపీ) పోటీ చేసి తొలి మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యారు. 1992లో రెండోసారి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సింగరేణిలో ఫిట్టర్‌గా పని చేస్తున్న అమురాజుల రాజేశ్వరరావు (టీడీపీ) మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యారు. ఆ క్రమంలోనే  సింగరేణిలో సంక్షేమాధికారిగా పదోన్నతి రావడంతో రాజేశ్వరరావు  చైర్మన్‌ పదవికి అర్థాంతరంగా రాజీనామా చేశారు. 

1995లో మున్సిపాలిటీకి మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు.  ఆ ఎన్నికల్లో సింగరేణిలో షాట్‌ఫైరర్‌గా పనిచేస్తున్న జంగం కేశవులు (కాంగ్రెస్‌) ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి అనూహ్యంగా మున్సిపల్‌  చైర్మన్‌ అయ్యారు.

నాల్గోసారి 2001లో నిర్వహించిన ఎన్నికల్లో సింగరేణి కార్మికుడిగా పని చేస్తున్న మత్తమారి సూరిబాబు భార్య మత్తమారి సరస్వతీ (కాంగ్రెస్‌) విజయబావుట ఎగురవేసి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2005లో ఐదోసారి సింగరేణి కంపెనీలో ల్యాంప్‌రూమ్‌ క్లర్క్‌గా పనిచేస్తున్న మత్తమారి సూరిబాబు (కాంగ్రెస్‌) బరిలో దిగి మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. సూరిబాబుకు ఆయన ప్రత్యర్థి పసుల సురేష్‌కు సమంగా చెరి 209 ఓట్లురాగా అదృష్టవశాత్తు టాస్‌తో గెలిచి చైర్మన్‌ అయి రికార్డు సృష్టించారు. 

ఆరోసారిగా 2014లో సింగరేణి కార్మిక కుటుంబం నుంచే మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహించారు. సింగరేణి ఉద్యోగిగా పని చేస్తున్న పసుల మహేష్‌ తన భార్య పసుల సునీతారాణి (టీఆర్‌ఎస్‌)తో పోటీ చేయించి గెలిపించారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా సునీతారాణి నాలుగేళ్లు పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత మున్సిపల్‌ సభ్యులు అవిశ్వాసం ప్రవేశపెట్టి సునీతారాణిని ఆ పదవి నుంచి దింపేశారు.  ఆమె స్థానంలో కార్మిక కుటుంబానికి చెందిన మునిమంద స్వరూప మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికై ఏడాది కాలం పాటు బాధ్యతలు చేపట్టారు. ఈసారి ఎవరిని వరించనుందో చూడాలి.

ఈసారి ఏమవుతుందో..?
ఏడోసారిగా మున్సిపాలిటీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 22న పోలింగ్‌ జరగనుంది. ఈ దఫా ఎన్నికల్లోనూ అనేక మంది కార్మిక కుటుంబాలకు చెందిన వ్యక్తులు పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కంపెనీలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగుల భార్యలు, కొడుకులు, కూతుళ్లు పోటీకి సై అంటున్నారు. కొందరు రిటైర్డు కార్మికులు కూడా ‘హమ్‌ కిసీసే కమ్‌ నహీ’ అంటున్నారు. ఈ క్రమంలో  పుర ప్రజలు మరోమారు సింగరేణి కుటుంబాలను మున్సిపల్‌ చైర్మన్‌గా పీఠం ఎక్కిస్తారో లేదా  వేరే వ్యక్తులను అందలం ఎక్కించి గత చరిత్రను చెరిపేస్తారో వేచి చూడాల్సిందే.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా