ఎట్టకేలకు ‘కారుణ్యం’

24 Mar, 2018 11:16 IST|Sakshi
సింగరేణి ప్రధాన కార్యాలయం

వారసత్వ ఉద్యోగ నియామకాల సర్క్యులర్‌ జారీ

జాబితాలో 16 జబ్బులు,

సింగరేణి వ్యాప్తంగా 3,600 మందికి ఊరట

రెండేళ్ల సర్వీసు ఉన్నవారే అర్హులంటూ నిబంధన 

సింగరేణి(కొత్తగూడెం) : సింగరేణి యాజమాన్యం ఎట్టకేలకు కారుణ్యనియమకాల సర్క్యులర్‌ను జారీచేసింది. ఈ సర్క్యులర్‌లో గతంలో ఉన్న 5 జబ్బులకు తోడు మరో 11 జబ్బులను చేర్చి మొత్తం 16 రకాల జబ్బులున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 09.03.2018 నాటికి రెండు సంవత్సరాల సర్వీసు ఉన్నవారు అర్హులని తెలిపింది.  దీంతో సింగరేణి వ్యాప్తంగా సుమారు 3,600 మందికి ఊరట కలగనుంది.

వీరు అర్హులు
1)పక్షవాతం, 2)మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు,  3)కాలేయ సంబంధిత వ్యాధులు 4)కేన్సర్, 5)మానసిక వ్యాధులు, 6)మూర్ఛ, 7) గని ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారు (ఉదాహరణకు కాళ్లు, చేతులు, కళ్లు ఇతరత్రా), 8)గుండె జబ్బులు, 9)టీబీ 10)హెచ్‌ఐవీ 11)కుష్టు వ్యాధి 12)కీళ్లవ్యాధి 13) దృష్టిలోపం, వినికిడిలోపం 14)మెదడు సంబంధిత వ్యాధులు 15) ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు 16) రోడ్డు, ఇతర ప్రమాదాలలో గాయపడి అంగవైకల్యం పొందిన వారు. మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారి ఉద్యోగం పొందే వారసుడి వయసు  35 సంవత్సరాలు ఉండాలని నిబంధన విధించింది. అయితే గతంలో (2015) ఇచ్చిన వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్‌లో సర్వీసు ఒక్క సంవత్సరం ఉన్నవారికి, వయోపరిమితి 40 సంవత్సరాలు ఉన్నవారికి అవకాశం కల్పించింది.  యాజమాన్యం ఈ సర్క్యులర్‌లో 2 రెండు సంవత్సరాల సర్వీసుతోపాటు, వయోపరిమితిని 35 సంవత్సరాలకు  కుదించింది. దీంతో  చాలామంది ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముందని, యాజమాన్యం పునరాలోచించాలని పలు కార్మిక సంఘాల నాయకులు వేడుకుంటున్నారు.

ఏడాది వారికీ అవకాశం కల్పించాలి
కారుణ్య నియామకంలో యాజమాన్యం ఒక్క సం వత్సరం సర్వీసు ఉన్నవారికి కూడా అవకాశం కల్పి స్తే ఆమోద యోగ్యంగా ఉంటుంది. మరికొంత మందికి అవకాశం వస్తుంది. వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్‌లో రెండు సంవత్సరాల సర్వీసు ఉన్నవారే అర్హులని పేర్కొనడం సరికాదు.   –భూక్యా శ్రీరామ్, పీవీకే–5షాఫ్టు గని

రేపు దిగిపోయేవారికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు
రేపు దిగిపోయే కార్మిక కు టుంబానికి కూడా  సహా యం చేయటానికి తెలంగాణ ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కానీ ఇప్పుడు రెండు సంవత్సరాల సర్వీసు ఉన్నవారు అర్హుల ని ప్రకటించటం దారుణం. అందరూ తెలం గాణ వాసులే. అంతా సింగరేణి తల్లీవడి పిల్లలే. అందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలి.   –వీరస్వామి, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ

వయోపరిమితి పెంచాలి
వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్‌లో వయోపరిమితి 40 సంవత్సరాలకు పెంచాలి. తాజాగా విడుదల చేసిన కారుణ్య నియామకాల  సర్క్యులర్‌లో వయోపరిమితిని 35 ఏళకు కుదించటంతో.. వందలాది కుటుంబాలు ఉద్యోగాలను పోగొట్టుకునే ప్రమాదముంది. వయోపరిమితిని పెంచి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలి.  –రాంశంకర్‌కోరి, పీవీకే–5షాఫ్ట్‌

మరిన్ని వార్తలు