తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌పై ‘సింగరేణి’ సమాచారం

21 Dec, 2019 05:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌–న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ బోగీలకు వెలువల సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌కు సంబంధించిన సమాచారం కనిపించనుంది. ఆ కంపెనీ ఆవిర్భావం, ప్రత్యేకతలు, విశిష్టతలు.. ఇలా సమస్త సమాచారం ఒక్కో బోగీపై ఒక్కో రకంగా కనిపిస్తుంది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే, సింగరేణి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ ఏర్పాటు జరిగింది. దక్షిణ మధ్య రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు బొగ్గు సరఫరా రూపంలోనే వస్తుంది. కానీ ఆ కంపెనీ మాత్రం ఇతరత్రా మార్గాల్లో అడ్వర్టైజ్‌ చేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రధాన ఆదాయాన్ని అందించే సంస్థలు రైళ్లపై ప్రకటనలు అతికిస్తే రైల్వేకు ఆదాయం వస్తుందన్న ఉద్దేశంతో ఇలాంటి ఏర్పాటు చేయాల్సిందిగా రైల్వే బోర్డు అధికారులను ఆదేశించింది. ఇప్పటికే రెండు జోన్లు వీటిని అమలులో పెట్టాయి. తాజాగా దక్షిణ మధ్య రైల్వే తన తొలిప్రయత్నంగా సింగరేణితో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాది పాటు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ బోగీలపై ఆ కంపెనీ వినాయిల్‌ రాపింగ్‌ ద్వారా ప్రకటనలు ప్రదర్శిస్తుంది. ఇందుకు రైల్వేకు సింగరేణి రూ.50 లక్షలు చెల్లిస్తుంది. 8 రాష్ట్రాల మీదుగా దాదాపు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌పై ఈ ప్రకటనలతో తమ కంపెనీకి దేశవ్యాప్తంగా గుర్తింపు పెరగడంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని కోల్‌మైన్స్‌ కంపెనీలతో ఉన్న పోటీలో ప్రయోజనం ఉంటుందని సింగరేణి భావిస్తోంది. సింగరేణి ప్రకటనలతో కూడిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ తొలి ప్రయాణం శుక్రవారం మొదలైంది.

మరిన్ని వార్తలు