పునరావాసంపై పట్టింపేది..?

6 Nov, 2018 18:50 IST|Sakshi

ఓసీపీ–2 విస్తరణ కోసం భూసేకరణ చేపట్టిన సింగరేణి

ఆందోళనలో లద్నాపూర్‌ నిర్వాసితులు

 ముత్తారం: సింగరేణి సంస్థ ఓసీపీ–2 విస్తరణ కోసం భూసేకరణ చేపట్టిన రామగిరి మండలం లద్నాపూర్‌ నిర్వాసితులకు కల్పించాల్సిన పునరావాసంపై అధికారులకు పట్టింపు కరువైంది. భూసేకరణలో సర్వం కోల్పోయిన నిర్వాసితుల కోరిక మేరకు గ్రామ సమీపంలోనే పునరావాసం కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈమేరకు గ్రామ సమీపంలో సర్వే నంబర్‌ 321, 322ల్లో సుమారు 17.17ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఈ భూమిని ఆనుకొని ఉన్న పట్టా భూముల్లో సుమారు 46 ఎకరాలు భూసేకరణ చేపట్టాలని అంచనా వేశారు. 

ఈమేరకు పట్టా భూముల సేకరణ కోసం 2013లో డీఎన్, డీడీలను ప్రచురించారు. డీఎన్, డీడీల కాలపరిమితి ముగిసినా ఇప్పటివరకు అధికారులు పునరావాసం కల్పించే ప్రదేశంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టపోవడంపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నిర్మాణాలు, భూములకు సంబంధించిన నష్టపరిహారం డబ్బులను నిర్వాసితుల ఖాతాల్లో జమ చేసిన నష్టపరిహారం డబ్బులు దుబారాగా ఖర్చు చేయకముందే పునరావసం కల్పిస్తే ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చని నిర్వాసితులు వాపోతున్నారు. 

సగం ఖర్చు..
పరిహారం డబ్బుల్లో ఇప్పటికే దాదాపు 50శాతం పైగా వివిధ అవసరాల కోసం ఖర్చయ్యాయని కొంతమంది నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఓసీపీ–2 క్వారీలో నిత్యం చేపడుతున్న బ్లాస్టింగ్‌ వల్ల బండరాళ్లు ఇళ్లపై వచ్చి పడుతుండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బ్లాస్టింగ్‌ సమయంలో వెలువడుతున్న దుమ్ము, ధూళి, దుర్వాసన వల్ల అనారోగ్యాల బారిన పడి మరణిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. 

ఓసీపీ క్వారీను ఆనుకొని మొలచిన సర్కార్‌ తుమ్మల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న అడవిపందులు ఎప్పుడు, ఎవరిపై దాడులు చేస్తాయోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తాము పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పునరావాసం పనులను వేగవంతం చేయాలని, పునరావస ప్రదేశంలో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్వాసితులు కోరుతున్నారు. 

వాతావరణం కలుషితం
గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఓసీపీ2 క్వారీలో నిత్యం చేపడుతున్న బ్లాస్టింగ్‌ వల్ల దుమ్ము, ధూళి లేచి వాతావరణం కలుషితం కావడంతో గ్రామస్తులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. బ్లాస్టింగ్‌ల బండరాళ్లు ఇళ్లపై పడుతుండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగించాల్సి వస్తోంది.       

– అడ్డూరి ప్రవీణ్, లద్నాపూర్‌ గ్రామస్తుడు

వేగవంతం చేయాలి
భూసేకరణ చేపట్టిన సింగరేణి సంస్థ నిర్వాసితులకు కల్పించాల్సిన పునరావసం పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నష్టపరిహారం కింద చెల్లించిన డబ్బులు వృథా కాకముందే పునరావాసం కల్పిస్తే నిర్వాసితులు ఇల్లు కట్టుకునే అవకాశముంది. అధికారులు పునరావాసం పనులను వేగవంతం చేయాలి.    

  – సురేష్, లద్నాపూర్‌ 

మరిన్ని వార్తలు