సింగరేణి కార్మికులకు నిరాశ

11 Jul, 2014 01:31 IST|Sakshi
సింగరేణి కార్మికులకు నిరాశ

- రూ.2.50 లక్షల వరకే పన్ను మినహాయింపు
- తెలంగాణ ప్రభుత్వ తీర్మానాన్ని పక్కన పెట్టిన కేంద్రం

 గోదావరిఖని : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సింగరేణి కార్మికులను నిరాశకు గురిచేసింది. భూగర్భంలో ప్రాణాలు ఫణంగా పెట్టి బొగ్గును వెలికితీస్తున్న నల్లసూరీళ్లను చిన్నచూపు చూసింది. తెలంగాణ ప్రభుత్వంతొలి అసెంబ్లీ సమావేశంలో గనికార్మికులకు ఆదాయపన్ను మినహాయించాలని కోరుతూ చేసిన తీర్మానంపై స్పందించ లేదు. కనీసం రూ.5 లక్షల వరకైనా పన్ను మినహాయింపు లభిస్తుందని కార్మికులు ఆశించగా.. రూ.2.50 లక్షలకే పరిమితం చేయడం వారిని ఆవేదనకు గురిచేసింది. గతంలో రూ.2లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఉంటే ప్రస్తుతం కేవలం మరో రూ.50 వేలు మాత్రమే వెసులుబాటు లభించింది.

సింగరేణిలో 63 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా వారిలో 35 వేల మంది రూ.40 వేల వేతనం, ఓపెన్‌కాస్ట్‌లలో పనిచేసే ఆపరేటర్లు, ఆ కేటగిరీ వారు రూ.90 వేల వేతనం పొందుతున్నారు. బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపును రూ.2.50 లక్షలకే పరిమితం చేయడం వల్ల కార్మికులు, ఉద్యోగులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కార్మికులకు యాజమాన్యం సమకూర్చే నివాసం, ఎల్‌పీజీ గ్యాస్, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలపైనా పన్ను వేస్తున్నారు. దీనివల్ల కార్మికులు, ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాల నేతలు
మండిపడుతున్నారు. ఆదాయపన్ను మినహాయిం పుపై సర్కారు పునరాలోచించాలని నాయకులు, కార్మికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు