వేజ్‌బోర్డు బకాయిలు ఏవి?

6 Jun, 2018 11:28 IST|Sakshi
సింగరేణి కార్మికులు(ఫైల్‌)

గోదావరిఖని(రామగుండం) : సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు 2016 జూలై ఒకటి నుంచి 10వ వేజ్‌బోర్డు అమలవుతోంది. కోల్‌ఇండియాలో చేసిన ఒప్పందం సింగరేణిలో కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ వేతన ఒప్పందానికి సంబంధించిన బకాయిల్లో కొంత మొత్తం చెల్లించగా...మిగిలిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనేది ఇంకా తేలకపోవడంతో కార్మికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా ఎనిమిది సబ్సిడరీ సంస్థలతో కూడిన కోల్‌ఇండియాలో పనిచేస్తున్న మూడున్నర లక్షల మంది, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సింగరేణిలో పనిచేస్తున్న 53 వేల మంది కార్మికులకు ప్రతీ ఐదేళ్లకోసారి వేతనాలు పెంచుతారు. ఇందుకోసం కోల్‌ఇండియా, సింగరేణిలో పనిచేస్తున్న జాతీయ కార్మిక సంఘాలు, యాజమాన్యాల నుంచి ప్రతినిధులను ఎంపికచేసి జాయింట్‌ బైపార్టియేటెడ్‌ కమిటీ ఫర్‌ కోల్‌ ఇండస్ట్రీ (జేబీసీసీఐ) అనే కమిటీని నియమిస్తారు. ఈ కమిటీ పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం వేతనాలు ఎంత మేరకు పెంచాలనే నిర్ణయం తీసుకుంటుంది. ఆ మేరకు పెరిగిన వేతనాలను కోల్‌ఇండియా యాజమాన్యం, సింగరేణి యాజమాన్యం కార్మికులకు అందజేస్తుంది. 

2017 నవంబర్‌ నుంచి కొత్త వేతనాలు..
పదో వేతన ఒప్పందం 2016 జూలై ఒకటి నుంచి అమలు కావాల్సిఉంది. పెరిగిన వేతనాలు అప్పటి నుంచి ఇవ్వాల్సి ఉండగా.. యాజమాన్యాలు 2017 నవంబర్‌ నెల నుంచి ఇస్తున్నాయి. అయితే 2016 జూలై నుంచి 2017 అక్టోబర్‌ వరకు 16 నెలలకు సంబంధించి ఇవ్వాల్సిన వేతనాలు యాజమాన్యాలు కార్మికులకు బకాయి పడ్డాయి. అయితే ఆనాడు చేసుకున్న ఒప్పందంలో భాగంగా ప్రతీకార్మికుడికి బకాయిలలో రూ.51 వేలను ప్రతీ కార్మికుడికి 2017 నవంబర్‌ 3న చెల్లించాయి. కానీ.. పెరిగిన వేతనాల ప్రకారం ఒక్కో కార్మికుడికి కనీసంగా లక్ష రూపాయల నుంచి రూ.2.50 లక్షల వరకు ఈ 16 నెలలకు సంబంధించి రావాల్సి ఉంది. ఇందులో రూ.51 వేలను ముందస్తుగా ఇవ్వగా మిగిలిన బకాయిలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ యాజమాన్యాలు ఇప్పటి వరకు వేతన బకాయిలను చెల్లించడానికి ముందుకు రాకపోవడంతో కార్మికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 

ఈనెల 15 లోపు ఇవ్వడం అనుమానమే..
కోల్‌ఇండియా యాజమాన్యం ఈనెల 15 లోపు వేతన ఒప్పంద బకాయిల్లో 70 శాతం వరకు చెల్లింపులు చేస్తామని మే 31న ఉత్తర్వుల జారీచేసింది. కానీ జేబీసీసీఐ కమిటీలోని జాతీయ కార్మిక సంఘాలకు చెందిన సభ్యుల సంఖ్య విషయంలో తారుమారు కావడంతో ఆయా సంఘాల సభ్యుల సమావేశం కాలేదు. దీంతో ఈ నెల 15లోపు ఇవ్వాలనుకున్న వేతన బకాయిలు కూడా చెల్లించేది అనుమానంగా ఉంది. కోల్‌ఇండియాలో చేసేచెల్లింపుల ఆ«ధారంగానే సింగరేణిలో కూడా వేతన బకాయిలు చెల్లిస్తారు. కానీ... కోల్‌ఇండియాలో వేతన బకాయిల చెల్లింపు జరిగే అవకాశాలు కనిపించకపోవడంతో ఇక్కడ కూడా చెల్లింపులు చేయడం జరగదనే ఊహగానాలు బయలుదేరుతున్నాయి. అయితే కోల్‌ఇండియాతో సంబంధం లేకుండా సింగరేణి యాజమాన్యం కార్మికులకు పదో వేతన ఒప్పంద బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు