ఇవేం కోతలు ?

1 May, 2020 12:25 IST|Sakshi

వేతనాల తగ్గింపుపై చీకటిసూర్యుల ఆవేదన

సింగరేణి కార్మికులకు గత నెల జీతం సగమే చెల్లింపు

మొత్తం ఇవ్వాలంటూ గనుల వద్ద ఆందోళన

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రకృతి విరుద్ధ వాతావరణంలో పనిచేస్తూ.. చీకటి సూర్యులుగా పేరుగాంచిన సింగరేణి కార్మికులు లాక్‌డౌన్‌ సమయంలోనూ అత్యవసర విభాగం కింద విధులు నిర్వహిస్తున్నారు. అయితే వైద్య, పోలీసు, రెవెన్యూ శాఖల్లాగే తమకూ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న తమను  ప్రోత్సహించాల్సింది పోయి గత నెల వేతనంలో 50 శాతం కోత విధించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   కార్మికుల పరిస్థితి ఇలా ఉంటే.. తాజాగా అధికారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం కలుగుతున్నట్లు తెలుస్తోంది. తమకు గత నెల వేతనం పూర్తిగా చెల్లించలేదంటూ సీఎంఓఏఐ (కోల్‌ మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) మాజీ అధ్యక్షుడు గడిపల్లి కృష్ణప్రసాద్‌ కొత్తగూడెం సింగరేణి కేంద్ర కార్యాలయం ఎదుట గురువారం గుండు గీయించుకుని నిరసన తెలిపారు.

సింగరేణిలో 44 వేల మంది కార్మికులు...
విపరీతమైన వేడి ఉండే ప్రదేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని, తమ శ్రమ వల్లే సంస్థకు లాభాలు వస్తున్నాయని, ప్రభుత్వానికి సైతం పన్నుల రూపంలో కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని కార్మికులు అంటున్నారు. ఇంత చేస్తున్నా తమ వేతనాల్లో కోత పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తగ్గించిన వేతనం తిరిగి చెల్లించకుంటే విధులకు వచ్చేది లేదంటున్నారు.
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల పరిధిలో 44,000 మంది కార్మికులు, 2,400 మంది అధికారులు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.220 కోట్ల వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ సమయంలోనూ చెమటోడుస్తున్న తమ జీతాల్లో కోత విధించడం ఏంటని మండిపడుతున్నారు. అత్యవసర విభాగం కింద పనిచేస్తున్న తమకు పూర్తి వేతనం చెల్లించాలంటూ పలు ఏరియాల్లో ఆందోళనలు చేస్తున్నారు.

కరోనా రక్షణ చర్యలూ అంతంతే..
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ తమకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. శానిటైజర్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఎందుకూ పనికిరాని మాస్క్‌లు ఇచ్చారని అంటున్నారు. మెరుగైన శానిటరీ కిట్స్‌తో పాటు ఎన్‌–95 మాస్క్‌లు అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అత్యవసర సేవలు అందిస్తున్న డాక్టర్లు, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు తమకు కూడా 10 శాతం ఇన్సెంటివ్, రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. 

పూర్తి వేతనం ఇవ్వాలి
ఏప్రిల్‌లో ఇచ్చే వేతనాల్లో 50 శాతం కోత విధించారు. ఈనెల అయినా పూర్తి వేతనం చెల్లించాలి. గత నెలలో నిలిపివేసిన 50 శాతం జీతం కూడా ఈనెలలో కలిపి ఇవ్వాలి.– ఎండీ హఫీనొద్దీన్, ఈపీ ఆపరేటర్‌

10 శాతం ఇన్సెంటివ్‌ చెల్లించాలి
కరోనా సమయంలో అత్యవసర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న పోలీసు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రభుత్వం 10 శాతం ఇన్సెంటివ్‌ ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో పనిచేస్తున్న మాకు కూడా 10 శాతం ఇన్సెంటివ్‌ చెల్లించాలి.– మెంగెన్‌ రవి, ఈపీ ఆపరేటర్‌

రూ.50 లక్షల బీమా వర్తింపజేయాలి
 అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా చెల్లించనున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. మాకు కూడా ఈ సౌకర్యం కల్పించి ఆదుకోవాలి.– సలిగంటి వెంకటేశ్వరరావు, జనరల్‌ మజ్దూర్‌

మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
 అత్యవసర విభాగంలో పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఎన్‌–95 మాస్క్‌లు అందించాలి. డాక్టర్లకు ఇస్తున్నట్టుగా ప్రత్యేక కిట్‌లు ఇవ్వాలి.– కూరేటి ఐలయ్య, ఈపీ ఎలక్ట్రీషియన్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు