‘సింగరేణి’కి సీఎం వరాలు

22 Jul, 2014 04:04 IST|Sakshi
'సింగరేణి’కి సీఎం వరాలు

గోదావరిఖని : సింగరేణి కార్మికులకు నిజంగా ఇది పండుగరోజు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన కార్మికులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరాలు కురిపించారు. సోమవారం హైదరాబాద్‌లో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో తీపి కబురు అందించారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 63 వేల మంది గని కార్మికులకు తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను ప్రకటించారు.

ఈ నిర్ణయంతో జిల్లాకు చెందిన ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 డివిజన్లకు చెందిన 20 వేల మందికి లబ్ధి చేకూరనుంది. మరోవైపు గని కార్మికులు పని ఒత్తిడితో చాలామంది విధులకు డుమ్మా కొట్టారు. వీరిని యాజమాన్యం డిస్మిస్ చేసింది. అలా విధులకు గైర్హాజరై డిస్మిస్డ్ అయిన వారినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో కార్మికుల్లో హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సింగరేణిలో వారసులకూ ఉద్యోగావకాశాలను పరిశీలిస్తామని ప్రకటించారు. సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
 
సమ్మెకాలానికి ప్రత్యేక సెలవు
2011లో సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 17వరకు 35 రోజుల పాటు సాగిన సకలజనుల సమ్మెలో కార్మికులందరూ పాల్గొన్నారు. ఆ సమయంలో వేతనం కోల్పోయారు. అయితే సమ్మెలో పాల్గొన్న కార్మికులకు కేసీఆర్ ప్రత్యేక సెలవుగా ప్రకటించారు. దీంతో మిగిలిన కార్మికులు తమ సెలవులను వినియోగించుకోనున్నారు. కార్మికులు, ఉద్యోగుల వేతనాలపై మూడు శాతం ఇంక్రిమెంట్ ఇస్తున్నారు. అయితే తెలంగాణ ఇంక్రిమెంట్‌ను ఎలా చెల్లిస్తారో ఇంకా విధివిధానాలు రూపొందించలేదు. ఒకవేళ మూడు శాతం అమలు చేస్తే ఒక్కో కార్మికుడికి రూ.1500 నుంచి రూ. 2,500 వరకు ఇంక్రిమెంట్ రూపంలో అందనుంది.
 
‘ఖని’లోనే సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి
నాలుగు జిల్లాల్లో మాదిరిగానే జిల్లాలో గోదావరిఖనిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల కోల్‌బెల్ట్ ప్రాంతాలకు అనుకూలంగా గోదావరిఖని ఉండడంతో ఆయా జిల్లాలోని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులకు అనుసంధానంగా ఇక్కడే మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే ఎన్టీపీసీ యాజమాన్యం కూడా సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో దీనిపై ఆశలు చిగురిస్తున్నాయి.
 
స్థలసేకరణ వేగవంతం చేయండి..
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల విద్యుత్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి ఇటీవల సీఎంని కలిసి సానుకూలత వ్యక్తం చేశారు. ప్లాంట్ కో సం 1500ఎకరాల స్థలాన్ని త్వరితగతిన సేకరిం చాలని సీఎం కేసీఆర్ సింగరేణి అధికారులకు సూచించారు. అలాగే తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ప్లాంట్ కోసం కూడా మరో 400 ఎకరాల స్థలాన్ని సేకరించాలని సం బంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

మరిన్ని వార్తలు