ఒక్కసారి వాడిపడేసినా నిషేధం

2 Oct, 2019 08:14 IST|Sakshi
ప్లాస్టిక్‌ నిషేధిద్దామంటూ నినాదాఉ చేస్తున్న తాళ్లపల్లి గ్రామస్తులు

నేటి నుంచే అమలు..

జరిమానాలు భారీగా విధిస్తే సాధ్యమేనంటున్న మేధావులు 

ప్లాస్టిక్‌ నిషేధంపై కొత్తపల్లిలో ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్‌ 

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడానికి కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ నెల 2 బుధవారం నుంచి ప్లాస్టిక్‌ భూతానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా ఒక్కసారి ఉపయోగించి పారవేసే గ్లాసులు, స్ట్రాలు, ప్లాస్టిక్‌ ప్లేట్లు, ప్లాస్టిక్‌ సంచుల నిషేధం అమలులోకి రానుంది.  ప్రధాని పిలుపుమేరకు జిల్లా యంత్రాంగం దీని నిషేధానికి ఇప్పటికే అవగాహన కల్గిస్తోంది. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా పచ్చదనం.. పరిశుభ్రతలో ప్లాస్టిక్‌ బ్యాగుల నిషేధానికి ప్రాధాన్యత నిస్తున్నారు.

సాక్షి, సంగారెడ్డి:  జిల్లా వ్యాప్తంగా 647 గ్రామాల్లో 26 రోజులుగా ‘30 రోజుల ప్రణాళిక’ అమలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. ప్రతీ గ్రామసభలోనూ సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం విషయాన్ని ప్రముఖంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్లాస్టిక్‌ భూతం వల్ల వాతావరణ, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని గురించి వివరిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు ఇందుకు గాను ప్రత్యేకంగా గ్రామసభలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

ఆయన కూడా ఏ గ్రామానికి వెళ్లినా ప్లాస్టిక్‌ వినియోగంతో వస్తున్న అనర్థాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మొత్తానికి కాకున్నా ఈ విషయంలో ఎంతో కొంత అవగాహన కల్పించడంలో అధికారులు సఫలీకృతమయ్యారు. దుకాణాల యజమానులు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న క్యారీబ్యాగ్‌లు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులను మాత్రమే విక్రయించాలని జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. దుకాణదారులతోనే కాకుండా ప్రజలు, వినియోగదారులు సైతం స్వచ్ఛందంగా సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ను వాడడం మానేస్తేనే ఉపయోగంగా ఉంటుందని పేర్కొంటున్నారు. 

జిల్లాలో ప్రతీ రోజు 6 నుంచి 8 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు 
మన జిల్లాలో ప్రతీ రోజు సుమారుగా 6 నుంచి 8 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటకు వస్తున్నాయని సమాచారం. జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలోనే ఎక్కువ శాతం సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కిరాణా దుకాణాలు, కూరగాయల వ్యాపారులు, హోటళ్లు, తోపుడు బండ్ల వ్యాపారులు ఈ ప్లాస్టిక్‌ను అధికంగా ఉపయోగిస్తున్నారు. వీరికి ఆయా మున్సిపాలిటీల ఆధ్వర్యంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు, తదితర వస్తువులను మాత్రమే వాడాలని మున్సిపల్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీలు, పట్టణ, మండల కేంద్రాలలో తరచుగా దుకాణాలపై దాడులు నిర్వహిస్తుండడంతో వీటి వినియోగం గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. కాగా గ్రామాలలో మాత్రం వీటి వినియోగం ఎక్కువైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో టీస్టాల్స్, దుకాణాలలో, విందులు, పెళ్లిళ్ల సమయంలో ఎక్కువగా ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లేట్లు, కవర్లను వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేయాలని సూచించడంతో ఇప్పటికైనా సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌  వాడడం తగ్గుతుందేమో వేచి చూడాల్సిందే. 

గ్రామాల్లోచెత్త బుట్టల పంపిణీ: 
ప్లాస్టిక్‌తో పాటుగా చెత్తాచెదారాన్ని ఎక్కడంటే అక్కడ పారబోయకుండా ప్రభుత్వం పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. 30 రోజుల పల్లె ప్రణాళికలో భాగంగా ప్రతి రోజు వినియోగిస్తున్న వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేసి బుట్టలలో ప్రత్యేకంగా వేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రభుత్వం ఆకుపచ్చ, నీలం చెత్త బుట్టలను ఇంటింటికీ పంపిణీ చేసింది. సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎం.హనుమంతరావు పాల్గొని ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. స్వయంగా శ్రమదానంలో పాల్గొన్నారు.

మున్సిపాలిటీ లేదా గ్రామపంచాయతీ వారు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన డంపింగ్‌ యార్డులలో వేయాల్సి ఉంటుంది. అక్కడవేసి మేనేజ్‌మెంట్‌ ప్రక్రియ ద్వారా రీసైక్లింగ్‌ చేయాల్సి ఉంటుంది. డంపింగ్‌ యార్డులు జిల్లాలో దాదాపుగా 70శాతం గ్రామాలలో అందుబాటులో లేకపోవడంతో ఎక్కడంటే అక్కడే చెత్తను పారబోసేవారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డుతో పాటుగా శ్మశాన వాటికలకు స్థలాలను కేటాయిస్తున్నారు. వీటి నిర్మాణాలు కూడా జిల్లాలోని చాలా గ్రామాలలో ప్రారంభమయ్యాయి. వీటి నిర్మాణాలు పూర్తయితే ఇక ఏ గ్రామంలోనూ రోడ్లపై చెత్త వేసే అవకాశమే లేకుండా పోతుంది. గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచడానికి మనవంతు కృషిచేయడమే జాతిపితకు మనం అర్పించే ఘన నివాళిగా పేర్కొనవచ్చు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా