పరిశ్రమల వద్దకే ప్రభుత్వం!

19 Jul, 2014 01:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమలు పెట్టేందుకు ఇకపై వెనకాడాల్సిన పనిలేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. వివిధ అనుమతుల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం అసలే ఉండదని భరోసా ఇస్తున్నాయి. జాప్యం, అధికారుల వేధింపులకు ఇక చోటే ఉండదంటున్నాయి. పరిశ్రమలు స్థాపిం చాలనుకుంటున్న వారి వద్దకే అన్ని ప్రభుత్వ సేవలు తరలివస్తాయని, వారికి రెడ్ కార్పెట్ పరుస్తామని హామీ ఇస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోనే అన్ని అనుమతులను ఒకేచోట మంజూరు చేసి అప్పగించే దిశగా దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించేందుకు టీ సర్కారు సిద్ధమవుతోంది. ఇందులో పారిశ్రామికవేత్తలకు అనువైన విధానాలను చేర్చాలని పరిశ్రమల శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. దీనిప్రకారం మెగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తల వద్దకు అధికారులే వెళ్లి.. వారికవసరమైన అనుమతులను మంజూరు చేయనున్నారు. ఈ అనుమతులన్నీ కూడా సింగిల్‌విండో ద్వారా ఒకేసారి మం జూరవుతాయి. అలాగే మెగా ఇండస్ట్రీ నిర్వచనాన్ని కూడా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రూ. 250 కోట్ల పెట్టుబడి పెట్టి, 1,500 మందికి ఉపాధి కల్పిస్తేనే మెగా ఇండస్ట్రీగా పరిగణిస్తున్నారు. అయితే ఇకపై రూ. 200 కోట్ల పెట్టుబడి దాటి, కనీసం వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తే మెగా ఇండస్ట్రీగా గుర్తించనున్నారు. ఈ మేరకు నూతన పారిశ్రామిక విధానంలో స్పష్టంగా పేర్కొంటారు. తద్వారా రూ. 200 కోట్లు దాటే ప్రతీ పరిశ్రమకు మెగా పరిశ్రమలకు ఇచ్చే విధంగా.. 100 శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు, మౌలికసదుపాయాల కల్పనకయ్యే వ్యయంలో 50 శాతం రీయింబర్స్‌మెంట్, 25-50 శాతం వ్యాట్, సీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలు లభించనున్నాయి. దీంతో ప్రభుత్వంపైనా రాయితీల భారం పెరగనుంది.  
 
 మరి ఆలస్యం చేయొద్దు..!
 
 పారిశ్రామికవేత్తలకు వేగంగా అనుమతులు ఇస్తామని, అయితే వారు అంతే వేగంగా నిర్ణీత సమయంలోగా యూనిట్‌ను ప్రారంభించాలని పరిశ్రమల శాఖ వర్గాలు అంటున్నాయి. ‘ప్రస్తుతం ఫలానా ప్రభుత్వ కార్యాలయం నుంచి అనుమతి రాలేదు కాబట్టే ఆలస్యమైందన్న కారణాలు చెప్పి యూనిట్ ఏర్పాటును కంపెనీలు ఆలస్యం చేస్తున్నాయి. దాంతో అంచనాల మేరకు ఉపాధి అవకాశాలు కూడా లభించడం లేదు. పరిశ్రమలకు ఇచ్చిన భూమి నిరుపయోగంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇకపై అనుమతులన్నీ ఒకేచోట మంజూరు చేయనున్నందున... కంపెనీలు కూడా నిర్ణీత సమయంలోగా ఉత్పత్తిని ప్రారంభించాలి. లేకుంటే ఇచ్చిన భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని’ ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ చర్యల వల్ల కంపెనీ వెంటనే ఉత్పత్తి ప్రారంభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడుతున్నాయి.
 
 కసరత్తు షురూ!
 
 నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు మొదలైంది. ఈ మేరకు ఈ నెల 22న వివిధ పారిశ్రామిక సంఘాలతో పరిశ్రమల శాఖ సమావేశం కానుంది. తెలంగాణ దృక్పథంతో  కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంలో భాగంగా ఫిక్కీ, ఫ్యాప్సీ, సీఐఐ వంటి పారిశ్రామిక సంఘాల నుంచి సూచనలు, సలహా లను స్వీకరించనుంది. పారిశ్రామికవేత్తలు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి రాయితీలు కావాలి? తదితర విషయాల్లో సర్కారుకందే అభిప్రాయాలకనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని అధికారులు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు