దుర్గమ్మా.. సింగూరు నీరు విడిపించమ్మా..

19 Aug, 2018 13:13 IST|Sakshi
     ఘనపురం ఆనకట్టపై వంటావార్పు

పాపన్నపేట(మెదక్‌): సింగూరు నీరు ఘనపురం ప్రాజెక్టుకు విడిపించేలా పాలకుల మనసు మార్చాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకులు ఏడుపాయల దుర్గమ్మకు శనివారం వినతిపత్రం సమర్పించారు. సాగునీటి సాధనే ధ్యేయంగా మెదక్‌ మాజీ ఎమ్మెలే శశిధర్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, రైతులు ఘనపురం ఆనకట్టపై వంటావార్పు నిర్వహించి అక్కడే భోజనాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత నాలుగేళ్లలో రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. 30 వేల ఎకరాల రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి 15టీఎంసీల సింగూరు నీటిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వదిలి, ఈ రోజు ఘనపురం రైతుల పంటలు ఎండబెడుతున్నారని ఆరోపించారు.

1992లో ఘనపురం ప్రాజెక్టుకు ప్రతి యేటా 4.06 టీఎంసిల నీరు విడుదల చేసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం జీఓ జారీ చేయించిందని తెలిపారు. ఖరీఫ్‌ పై ఆశతో వరితుకాలు వేసుకున్న రైతుల పొలం మడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు రైతుల బాధలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా 0.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కాంగ్రెస్‌ పంచాయతీ రాజ్‌ సెల్‌ కన్వీనర్‌ మల్లప్ప మాట్లాడుతూ సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు నీరు విడిపించాల్సిన బాధ్యత ఎమ్మేల్యేదే నన్నారు. ఈ ధర్నాలో మండల కాంగ్రెస్‌ అ«ధ్యక్షుడు అమృత్‌రావు, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీకాంతప్ప, ఏడుపాయల మాజీ చైర్మన్‌లు గోపాల్‌రెడ్డి, నర్సింలుగౌడ్, కాంగ్రెస్‌ నాయకులు ఉపేందర్‌రెడ్డి, భూపతి, శ్యాంసుందర్‌అబ్లాపూర్‌ మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు