సింగూరుకు ఇక సెలవు..!

29 Jan, 2019 05:53 IST|Sakshi

ఈ వారంలో గోదావరి రింగ్‌మెయిన్‌–3 ట్రయల్‌రన్‌

ఇక గ్రేటర్‌ సిటీకి కృష్ణా, గోదావరి జలాలే ఆధారం

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి రింగ్‌మెయిన్‌–3 పనుల పూర్తితో గ్రేటర్‌ హైదరాబాద్‌కు సింగూరు, మంజీరా జలాశయాల నీటితరలింపునకు శాశ్వతంగా సెలవు ప్రకటించాల్సిందేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నగర శివార్లలోని ఘన్‌పూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు 43 కి.మీ. మార్గంలో రింగ్‌మెయిన్‌ పనులు పూర్తికావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే మెదక్, నర్సాపూర్‌ ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ పథకం పనులు పూర్తి కావడంతో అక్కడి తాగునీటి అవసరాలకు నిత్యం 40 మిలియన్‌ గ్యాలన్ల తాగునీరు అవసరమవుతుందని, గ్రేటర్‌ తాగునీటి అవసరాలకు సింగూరు, మంజీరా జలాలు మినహా ఇతర ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందేనని ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి అధికారులు, రాజకీయ నేతల నుంచి ఒత్తిడులు తీవ్రం కావడంతో జలమండలి అప్రమత్తమైంది. ఇప్పటికే రూ.398 కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన గోదావరి రింగ్‌మెయిన్‌–3 పనుల్లో గౌడవెల్లి ప్రాంతంలో బాక్స్‌ కల్వర్టు ఏర్పాటు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ పైప్‌లైన్‌పై వాల్వ్‌ల ఏర్పాటు వంటి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ఈ వారంలో ట్రయల్‌రన్‌ నిర్వహించేందుకు జలమండలి సన్నద్ధమవుతోంది.  

గ్రేటర్‌ దాహార్తిని తీర్చిన సింగూరు, మంజీరా జలాలు
భాగ్యనగరానికి జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల తరవాత 70వ దశకం నుంచి సింగూరు, మంజీరా జలాల తరలింపు ప్రక్రియ మొదలైంది. నాటి నుంచి నేటి వరకు పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ తదితర ప్రాంతాలకు ఈ జలాలే దాహార్తిని తీర్చేవి. అయితే, గోదావరి మొదటిదశ పథకం పూర్తితో సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నిత్యం 40 మిలియన్‌ గ్యాలన్ల తాగునీటిని నగరానికి తరలించినప్పటికీ ఇందులో సింహభాగం పటాన్‌చెరు, సంగారెడ్డి ప్రాంతాలతోపాటు ఇక్కడున్న పలు ప్రతిష్టాత్మక సంస్థలు, కంపెనీలకు తాగునీటిని సరఫరా చేసేవారు. ఏడాదిగా నగర తాగునీటి అవసరాలకు నిత్యం సుమారు 10 మిలియన్‌ గ్యాలన్ల సింగూరు, మంజీరా జలాలను మాత్రమే సరఫరా చేసినట్లు జలమండలి వర్గాలు పేర్కొంటున్నాయి. రింగ్‌మెయిన్‌ పైప్‌లైన్‌–3 పూర్తితో ఇక నుంచి సింగూరు జలాలు నిలిచిపోయినప్పటికీ కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు తదితర ప్రాంతాలకు గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని జలమండలి స్పష్టం చేసింది. ఈ వారంలో ట్రయల్‌రన్‌ పూర్తి చేసి ఫిబ్రవరి మొదటివారం నుంచి గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని తెలిపింది.
కృష్ణా, గోదావరి
జలాలే ఆధారం...
జంట జలాశయాల నీటిని నగర తాగునీటి అవసరాలకు సేకరించవద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించడం, త్వరలో సింగూ రు, మంజీరా జలాల సరఫరా నిలిచిపోనుండటంతో భాగ్యనగరానికి కృష్ణా, గోదావరి జలాలే ఆధారం కానున్నా యి. ప్రస్తుతానికి కృష్ణా మూడు దశల ద్వారా నిత్యం 270 మిలియన్‌ గ్యాల న్లు, గోదావరి మొదటిదశ ద్వారా మరో 130 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. రింగ్‌మెయిన్‌–3 పనుల పూర్తితో అదనంగా మరో 60 ఎంజీడీల గోదావరి జలాలను సిటీకి తరలించనున్నారు. దీంతో నిత్యం నగరానికి 460 మిలియ న్‌ గ్యాలన్ల జలాలను సరఫరా చేయనున్నారు. ఈ నీటిని నగరంలోని 9.60 లక్షల నల్లాలకు కొరత లేకుండా సరఫ రా చేయనున్నట్లు జలమండలి అధికా రులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు