సింగూరు జలాలతో సిరులు పండాలి

31 Jul, 2014 00:28 IST|Sakshi
సింగూరు జలాలతో సిరులు పండాలి

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సమైక్య రాష్ట్రంలో కానిది ఇప్పుడు సాధించాం
డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి
ఘనపురం ఆనకట్టకు 0.25 టీఎంసీల నీరు విడుదల
 పుల్‌కల్: సింగూరు జలాలతో సిరులు పండాలని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బుధవారం మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆనకట్టకు 0.25 టీఎంసీల నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఘనపురం ఆయకట్టు కింద సుమారు 12 వేల ఎకరాలలో నారుమళ్లు ఉన్నాయని ఆ పంటలను కాపాడుకునేందుకు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో నీటిని వదలాలంటే గతంలో హెచ్చార్సీకి వెళ్లిన సందర్భాలున్నాయన్నారు. సమైక్య రాష్ట్రంలో సాధించుకోనివి ఇప్పుడు అనుకున్నదే తడవుగా సాధించుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్ అన్నారు.

ఇది రైతు ప్రభుత్వమని, రైతులు కోరుకున్న వెంటనే నీటిని వదులుతున్నామన్నారు. ఘనపురం ఆనకట్టకు సాగునీరు కావాలని మంత్రి హరీష్‌రావు సీఎం కేసీఆర్‌ను కోరారని, సీఎం వెంటనే నీటిని వదిలేలా ఆదేశాలు జారీ చేశారన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉండి ఎన్ని పోరాటాలు చేసినా నీరు వదిలేందుకు అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. రైతులు అడిగిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం నీరు విడుదల చేసిందన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు కనకారెడ్డి, సంగమేశ్వర్‌గౌడ్, రమేష్ బస్వరాజ్, స్వామి, రాజ్‌కుమార్, శంకరయ్య, ఇన్‌చార్జి కలెక్టర్ శరత్, మెదక్ ఆర్డీఓ వనజాదేవి, తహశీల్దార్ ఎల్లారెడ్డి, ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ జగన్నాథం, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు