ఎట్టకేలకు సింగూరు జలాలు విడుదల

29 Mar, 2014 03:42 IST|Sakshi

నిజాంసాగర్, న్యూస్‌లైన్ : నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల అవసరాల కోసం ఎట్టకేలకు సింగూరు ప్రాజెక్టు నుంచి జలాలు విడుదలయ్యాయి. వాటా ప్రకారం నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఏడు టీఎంసీల నీటిని వదలాలని ప్రతిపాదించగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు  టీఎంసీల నీటి విడుదలకు అనుమతినిచ్చింది. ఈమేరకు సింగూరు జలాశయం టర్బయిన్ గేట్ల ద్వారా 3600 క్యూసెక్కుల నీటిని రెండు రోజులుగా విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టు ఒక వరదగేటు ద్వారా 9వేల క్యూసెక్యుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి నీటిని వదులుతుండటంతో మంజీర వాగులో నీటి ప్రవాహం ఉరకలేస్తోంది. ప్రాజెక్టు దిగువ ఉన్న పరిసర ప్రాంతాలకు రైతులు, పశువుల కాపరులు వెళ్లవద్దని నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు.

 రేపటిలోగా సాగర్‌లోకి సింగూరు జలాలు
 సింగూరు జలాశయం నుంచి వదులుతున్న నీరు ఆదివారం సాయంత్రం వరకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరే అవకాశాలున్నాయి. సింగూరు జలాశయం, నిజాంసాగర్ ప్రాజెక్టు మద్య 90 కిలోమీటర్ల దూరం ఉండటంతో మంజీర వాగు ద్వారా జలాలు రానున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న మంజీర వాగులో దిబ్బలు, నీటి మడుగులు అధికంగా ఉండటంతో పాటు తుమ్మచెట్లు ఏపుగా పెరగడంతో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది. సింగూరు జలాశయం నుంచి నీటిని వదిలినా నిజాంసాగర్‌లోకి 2.8 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరే అవకాశముంది. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1396.42 అడుగులతో 7.94 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

మరిన్ని వార్తలు