సిరిసిల్ల టూ చెన్నై..

27 Dec, 2014 02:36 IST|Sakshi
సిరిసిల్ల టూ చెన్నై..

మరమగ్గాలపై చీరలు, పంచెల ఉత్పత్తి..
సంక్షోభ సిరిసిల్లకు ఉపాధి..

 
సిరిసిల్ల: వస్త్రోత్పత్తి ఖిల్లా సిరిసిల్ల చీరలకు కొత్త ఆఫర్లు వస్తున్నాయి. కాలం చెల్లిన మగ్గాలపై కాటన్ (ముతక రకం) వస్త్రమే కాకుండా మార్కెట్లో అమ్ముడుపోయే చీరలు, పంచెల  ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందు చీరలకు మంచి గిరాకీ ఉంటుండగా.. ఈ ఏడాది తమిళనాడు ప్రభుత్వం భారీగా పంచెలు, చీరలకు ఆర్డర్ ఇవ్వడంతో సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి.
 
పండుగ శోభ..
 తమిళనాడులో ఏటా సంక్రాంతి (పొంగల్)కి పేదలకు వస్త్రాలను అందజేస్తారు. మహిళలకు చీరలు, పురుషులకు పంచెలు అందిస్తారు. ఈ నేపథ్యంలో మూడు లక్షల చీరలు, మరో మూడు లక్షల పంచెలకు కొత్తగా తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. దీంతో సిరిసిల్ల నేతకార్మికులకు ఉపాధి మెరుగైంది. పండుగకు కొద్ది రోజులే గడువు ఉండడంతో మరమగ్గాలపై వేగంగా చీరలు, ధోవతులు, పంచెలను ఉత్పత్తి చేస్తున్నారు.
 
 తమిళనాడులో 1.72కోట్ల పంచెలు, మరో 1.73కోట్ల చీరలు అవసరం ఉండడంతో అక్కడ ఆ మేరకు ఒకేసారి ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో అక్కడి ఏజెంట్ల దృష్టి సిరిసిల్లపై పడింది. దీంతో ఇక్కడ భారీగా ఆర్డర్లు ఇస్తూ.. చీరలు, పంచెలు ఉత్పత్తి చేయిస్తున్నారు. పాలిస్టర్, కాటన్ నూలు కలిసిన దారంతో మెత్తగా చీరలు, పంచెలను నేస్తున్నారు. సిరిసిల్లలో రెండు వేల మరమగ్గాలపై చీరలు, పంచెలు ఉత్పత్తి అవుతున్నాయి. ఒక్కో మగ్గం నిత్యం వంద మీటర్లు ఉత్పత్తి చేస్తుండగా, రోజుకు రెండు లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. పక్షం రోజుల్లో తమిళనాడుకు అవసరమైన చీరలు, పంచెలను ఉత్పత్తి చేసే శక్తి సిరిసిల్ల నేతన్నలకు ఉంది.
 
 రాష్ట్రంలోనే అగ్రగామి...
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సిరిసిల్ల మరమగ్గాలు అగ్రగామిగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 78 వేల మరమగ్గాలుండగా.. ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్, 7 వేల మరమగ్గాలపై కాటన్(ముతర) రకం వస్త్రం ఉత్పత్తి అవుతుంది. నిత్యం ఐదు లక్షల మీటర్ల వస్త్రం సిరిసిల్లలో ఉత్పత్తి అవుతుండగా.. ఈ మేరకు మార్కెట్‌లో వినియోగం లేక ధర లభించడం లేదు. మరోవైపు షోలాపూర్, బీవండి, ఇచ్చంఖరేంజ్ లాంటి ప్రాంతాల నుంచి సిరిసిల్ల కంటే నాణ్యమైన వస్త్రం పోటీకి రావడంతో మన వస్త్రానికి డిమాండ్ తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిరిసిల్ల నేతన్నలు ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉన్న మరమగ్గాలపై కాటన్ చీరలు, తువ్వాళ్లు, ధోవతులు, కర్చిఫ్‌లు, లుంగీలను ఉత్పత్తి చేస్తున్నారు.
 
 రంగు రంగుల చీరలు...
 సిరిసిల్లలో ఉత్పత్తవుతున్న చీరలకు మంచి డిమాండ్ ఉంది. ఆ చీరలపై అనువైన రంగుల్లో ప్రింటింగ్ చేసి ఆధునిక హంగులను సమకూర్చే అవకాశం ఉంది. సిరిసిల్ల వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. పాలిస్టర్ వస్త్రంను ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.1.45 పైసలు లభిస్తుండగా, అదే చీర ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.4.50 చెల్లిస్తున్నారు. ఒకే పనికి కొద్ది నైపుణ్యం జోడిస్తే మూడింతల కూలి దొరుకుతుంది. సిరిసిల్లలో తక్కువ ధరకే వస్త్రం ఉత్పత్తవుతుండగా, తమిళనాడు వ్యాపారులు భారీ ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా మార్చుకుంటూ వెళ్తే ఏడాది పొడవునా నేతన్నలకు ఉపాధి లభించనుంది.  
 
 పండుగ ముందు గిరాకీ
 సిరిసిల్లలో ఉత్పత్తి అయ్యే చీరలకు పండుగ ముందు ఎప్పుడూ గిరాకీ ఉంటుం ది. ఈ సారి కొత్తగా ఆర్డర్లు వచ్చిన విషయం మాకు తెలియదు. కానీ మంచిగనే గుడ్డ అమ్ముడు పోతుంది. పని చేసుకుంటే రోజుకు 350 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది.
 - సబ్బని నర్సయ్య, ఆసామి
 
 పని బాగానే ఉంది
 మరమగ్గాలపై చీరలు ఉత్పత్తి చేస్తాను. పని బాగానే ఉంది. మీటర్‌కు మూడున్నర ఇస్తారు. వారానికి పద్నాలుగు వందలు వస్తాయి. 12 గంటలు పని చేస్తే నెలకు ఐదువేల వరకు సంపాదించవచ్చు. కాటన్ పాలిస్టర్ కంటే కొద్దిగా పని ఎక్కువగా ఉంటుంది.
 - కొంక విజయ్‌కుమార్, రాజీవ్‌నగర్
 

మరిన్ని వార్తలు