నేతన్న బతికి 'బట్ట' కట్టేదెలా?

17 Jan, 2017 08:18 IST|Sakshi
సిరిసిల్లలో పేరుకుపోయిన వస్త్రం నిల్వలు

సిరిసిల్లలో పేరుకుపోయిన 8.1 కోట్ల మీటర్ల వస్త్ర నిల్వలు
నెలరోజులుగా కొనేవారే లేరు
నూలు ధర ఆకాశంలో.. బట్ట ధర పాతాళంలో
దారం ధర పెరిగి గిట్టుబాటుకాని వస్త్రం తయారీ
గోరు చుట్టుపై రోకటి పోటులా ‘పెద్దనోట్ల రద్దు’
కొనుగోలుకు ముందుకురాని సేట్లు
వస్త్రోత్పత్తిదారుల ఇళ్ల నిండా బట్టల గుట్టలే..


సిరిసిల్ల: పాతిక వేల మంది నేతన్నలకు ఉపాధి కల్పించే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. దారం ధరలు అమాంతం పెరిగినా బట్ట ధర పెరగకపోవడంతో జిల్లా కేంద్రంలో ఎక్కడికక్కడ వస్త్రం నిల్వలు పేరుకుపోయాయి. కొనేవారే లేకపోవడంతో ఏ ఆసామి, వస్త్రోత్పత్తిదారు ఇల్లు చూసినా పాలిస్టర్‌ వస్త్రంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. నెలరోజులుగా సిరిసిల్లలో ఏకంగా 8.10 కోట్ల మీటర్ల వస్త్రం నిల్వలు పేరుకుపోయాయి. దీంతో వస్త్రోత్పత్తిదారుల పరిస్థితి అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివిలా తయారైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో పాలిస్టర్‌ నూలు(దారం) ధరలు ఒక్కసారిగా చుక్కలనంటాయి. దారం ధర పెరిగినా ఉత్పత్తి అయిన బట్టకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈ సంక్షోభం తలెత్తింది.

కిలోపై రూ.15 పెరుగుదల
తెలంగాణ, ఏపీలో మొత్తంగా 78 వేల మరమగ్గాలు ఉండగా ఒక్క సిరిసిల్లలోనే 33 వేల మరమగ్గాలు పనిచేస్తున్నాయి. వీటిలో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్‌ వస్త్రం ఉత్పత్తి అవుతోంది. పక్షం రోజుల క్రితం రూ.93 ఉన్న కిలో నూలు ధర ఒక్కసారిగా రూ.108కి చేరింది. దీంతో వస్త్రోత్పత్తి వ్యయం భారీగా పెరిగింది. సిరిసిల్లకు గుజరాత్‌లోని సిల్వాస, పాపి, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి నూలు దిగుమతి అవుతోంది. ఒక్కో లారీలో 12 టన్నుల మేర నూలు వస్తోంది. ప్రతినెలా సిరిసిల్లకు 200 లారీల వరకు నూలు దిగుమతి అవుతోందని అంచనా. ఈ లెక్కన 2400 టన్నుల నూలు వస్తోంది. నూల ధరలు పెరగడంతో వ్యాపారులు గతంలో కంటే ప్రస్తుతం ప్రతినిత్యం రూ.12 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమకు ఇది మోయలేని భారంగా మారింది.

పెరగని బట్ట ధరలు
పాలిస్టర్‌ వస్త్రం మీటరుకు రూ.6.50 ధరతో అమ్ముడవుతోంది. నూలు ధర పెరిగినా బట్ట ధర మాత్రం అంతే ఉంది. దీనికితోడు అసలు పాలిస్టర్‌ వస్త్రాన్ని కొనేవారే లేకపోవడంతో నిల్వలు గుట్టల్లా పేరుకుపోయాయి. ఒక్కో మగ్గంపై వంద మీటర్ల వస్త్రం ఉత్పత్తి అవుతోంది. ఈ లెక్కన నిత్యం 27 లక్షల మీటర్ల బట్ట వస్తోంది. పెరిగిన ధరలతో పోలిస్తే మీటర్‌ వస్త్రానికి రూ.7.10 నుంచి రూ.7.50 వరకు ధర పలికితేనే వస్త్రోత్పత్తిదారులకు గిట్టుబాటు అవుతుంది. కానీ హైదరాబాద్‌లోని సేట్లు బట్ట కొనుగోలు చేయకుండా సిండికేట్‌గా మారి ధరను పెంచడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పులిమీద పుట్రలా నోట్ల రద్దు..
నూలు తయారీకి ముడిసరుకు క్రూడ్‌ ఆయిల్‌. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడల్లా నూలు ధరలు పెరుగుతుంటాయి. ఇప్పుడూ అదే జరిగింది. దీనికితోడు పెద్దనోట్ల రద్దు ప్రభావం కూడా వస్త్రోత్పత్తి రంగంపై పడింది. నూలు కొనుగోలు వే బిల్లులు, ట్యాక్స్‌లు చెల్లించి జరుగుతుండగా.. వస్త్రం అమ్మకాల్లో మాత్రం జీరో దందా సాగుతోంది. హైదరాబాద్‌లోని సేట్లు ఇప్పటి వరకు నేరుగా బట్ట కొని నగదు ఇచ్చేవారు. ఇప్పుడు లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరగాలన్న నిబంధనలు విధించడంతో వారంతా బట్ట కొనుగోళ్లను తగ్గించారు. దీంతో నేతన్నల పరిస్థితి అయోమయంగా మారింది.

బట్టను అడిగేవాళ్లే లేరు
నెల రోజులుగా బట్టను అడిగేవారే లేదు. ఇప్పుడు దారం ధరలు పెరడంతో ఇబ్బందిగా ఉంది. డీజిల్, పెట్రోల్‌ ధరలు పెరిగినప్పుడల్లా దాని ప్రభావం వస్త్ర పరిశ్రమపై తీవ్రంగా ఉంటోంది. ఇంటి నిండా గట్టాలతో నిండిపోయింది. వస్త్ర ఉత్పత్తి వ్యయానికి మార్కెట్‌లో ధరకు చాలా వ్యత్యాసం ఉంది. -బూట్ల నవీన్, వస్త్ర వ్యాపారి

నిల్వలు పేరుకుపోయాయి
పాలిస్టర్‌ ఉత్పత్తి చేసే ఆసాములు, యజమానుల ఇళ్లలో భారీగా వస్త్రం నిల్వలు పేరుకుపోయాయి. పాలిస్టర్‌ నూలు ధరలు భారీగా పెరిగాయి. దీంతో నష్టానికి అమ్ముకోలేకపోతున్నాం. బట్టకు ధర పెరిగితేనే గిట్టుబాటు అవుతుంది. -గోవిందు రవి, పాలిస్టర్‌ వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు

పదిహేను రోజులకు పగార్‌ ఇస్తుండ్రు
మునుపు సేట్లు వారం వారం కూలి పైసలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు పదిహేను రోజులకు ఇస్తుండ్రు. బట్ట అమ్ముడుపోతలేదు. సాంచాలు నడిపితేనే ఇల్లు గడుస్తుంది. నా భార్యకు బీడీల పైసలు కూడా సక్కంగ అత్తలేవు. ఇటేమో బట్ట అమ్ముడు పోతలేదు. -బాస బత్తిని వెంకటేశ్, నేత కార్మికుడు

మరిన్ని వార్తలు