‘పౌల్ట్రీ’కి ఎండదెబ్బ!

10 May, 2015 23:41 IST|Sakshi

 అమాంతం పెరిగిన ఉష్ణోగ్రతలు
 నిత్యం వందలాది కోళ్ల మృత్యువాత
 ఆందోళనలో పౌల్ట్రీఫాంల యజమానులు

 
యాచారం : రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. వేడిగాలులు, ఎండదెబ్బతో నిత్యం వందలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.  వారం రోజులుగా వేసవి తీవ్రత ఉగ్రరూపం దాలుస్తోంది. దీంతో కోళ్లు వేడిని తట్టుకోలేకపోతున్నాయి. వాటిని రక్షించుకోవడానికి పౌల్ట్రీఫాంల యజమానులు శతవిధాలుగా చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండాపోతుంది. అప్పులపాలు కాకతప్పదని వారు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలో పలు గ్రామాల్లో సన్న, చిన్నకారు రైతులు మాల్ ఆంధ్రా బ్యాంకు, యాచారం పీఏసీఎస్, ఎస్‌బీహెచ్‌లలో అప్పులు తీసుకొని పౌల్ట్రీఫాంలు ఏర్పాటు చేశారు.

తమ్మలోనిగూడ, చౌదర్‌పల్లి, నక్కర్తమేడిపల్లి, మొండిగౌరెల్లి, యాచారం, చింతుల్ల తదితర గ్రామాల్లో దాదాపు 200 మంది రైతులు  ఆయా బ్యాంకుల్లో రూ. లక్షలాది రుణాలు పొందారు. వ్యవసాయానికి తోడుగా పౌల్ట్రీఫాంలను నిర్వహిస్తే మంచి ఆదాయం పొందవచ్చని ఆశించారు. ప్రస్తుతం వారి కలలు కల్లలయ్యే దుస్థితి దాపురించింది. లాభాల మాటేమోగాని నష్టాలు చవిచూడకుండా ఉంటే చాలని రైతులు పేర్కొంటున్నారు.

మండలంలోని పలు గ్రామాల్లో వేలాది కోళ్లు వేసవి తాపానికి అస్వస్థతకు గురికావడం, నీళ్లు చల్లినా, అవసరమైన మందులు అందిస్తున్నా క్షణాల వ్యవధిలోనే మృతి చెందుతుండడంతో పౌల్ట్రీ యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండలంలోని పలు గ్రామాల్లో పౌల్ట్రీఫాంలను నిర్వహిస్తున్న రైతులు వివిధ బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఇంటిగ్రేషన్ పద్ధతిన కోళ్ల పెంపకం చేపడుతున్నారు. స్నేహ, సుగుణ, శ్రీ వెంకటేశ్వర తదితర కంపెనీల నుంచి కోడిపిల్లలను తీసుకువచ్చి పెంచుతున్నారు.

నిబంధనలు, ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలే నిర్వహణ డబ్బులు చెల్లిస్తాయి. కోడిపిల్లలను అందజేసిన 35 నుంచి 38 రోజుల్లోనే ఆయా సంస్థలే కోళ్లను తీసుకెళ్తాయి. ప్రస్తుతం చికెన్ ధరలు బాగానే ఉన్నప్పటికి, కోళ్లు మృత్యువాత పడుతున్న దృష్ట్యా ఇంటిగ్రేషన్ సంస్థలు 45 రోజులు దాటినా కోళ్లను తీసుకెళ్లడంలేదంటున్నారు రైతులు. కోళ్లు రోజురోజుకూ బరువు పెరుగుతుండటంతో పాటు దాణా రెండింతలు తింటున్నాయి.

సకాలంలో కోళ్లను తరలించకపోవడం, దాణా ఖర్చులు భారంగా మారడంతో రైతులకు పెంపకం ఖర్చులు భారంగా మారాయి. దీనికి తోడు వారంరోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో వేసవి తాపానికి కోళ్లు మృతిచెందుతున్నాయి. దీంతో తాము అప్పుల్లో కూరుకుపోయే దుస్థితి దాపురించిందని పౌల్ట్రీ యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు