కేసును పక్కదోవ పట్టిస్తున్నారు

17 Jun, 2017 02:02 IST|Sakshi
కేసును పక్కదోవ పట్టిస్తున్నారు

- శిరీష తండ్రి రవీందర్, అక్క భార్గవి ఆరోపణ
- రాజీవ్, శ్రవణ్, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి కలిసే హత్య చేశారు
- న్యాయం జరిగే వరకూ పోరాడతామని వెల్లడి


మిర్యాలగూడ‌: శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అది ముమ్మాటికీ హత్యేనని ఆమె తండ్రి ఎక్కంటి రవీందర్, అక్క భార్గవి పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రవీందర్, భార్గవి విలేకరులతో మాట్లాడారు. శిరీష కుటుంబా నికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, మరే విధమైన సమస్యలు లేవని వారు పేర్కొ న్నారు. ఎంతో చలాకీగా ఉండే శిరీష మంచి బ్యూటీషియన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందన్నారు.

స్నేహితుల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలంటూ.. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వద్దకు వెళితే శిరీషపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. పోలీసు అధికారులే ఇలా చేస్తే ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్, శ్రవణ్, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ముగ్గురు కలసి పథకం ప్రకారమే శిరీషను హత్య చేశారని ఆరోపించారు. శిరీష దేహంపై గాయాలున్నాయని వాటిని చూస్తే ముమ్మాటికీ హత్యేనని అర్థమవుతోందని చెప్పారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కూడా హత్యగా పేర్కొన్నారని.. కానీ కావాలనే పోలీసులు కేసును నీరుగార్చుతున్నారని ఆరోపించారు.

పోరాటం చేస్తాం..
రాజీవ్‌తో శిరీషకు వివాహేతర సంబంధం ఉందని పోలీసులు చెప్పడం దారుణమని.. పోలీసు శాఖను కాపాడుకోవడానికే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని శిరీష తండ్రి, సోదరి పేర్కొన్నారు. దగ్గరుండి కంటితో చూసినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. తేజస్విని వల్లే వారి మధ్య వివాదం వచ్చిందని, ఆమెను విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు. కానీ పోలీసులు ఇప్పటి వరకు కూడా తేజస్వినిని ఎందుకు విచారించలేదని ప్రశ్నిం చారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని... మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ప్రభు త్వం చొరవ తీసుకుని కేసును తిరిగి విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు