సిరిసిల్లను మరో తిరుపూర్‌ చేస్తా 

9 Feb, 2019 00:40 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు

సాక్షి, సిరిసిల్ల: సిరిసిల్లను మరో తిరుపూర్‌గా తీర్చిదిద్దుతానని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. శుక్రవారం పద్మశాలీల ఆరాధ్య దైవం మార్కండేయ జయంతి సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్లకు కన్నతల్లిలాగే రుణపడి ఉంటానని చెప్పారు. ఏటా రూ.36 వేల కోట్ల వస్త్రోత్పత్తి చేస్తున్న తమిళనాడులోని తిరుపూర్‌ స్థాయికి సిరిసిల్లను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా త్వరలోనే అపరెల్‌ పార్కును ప్రారంభిస్తామని, 10 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు, ఆర్‌వీఎం ఆర్డర్లతో కొంతవరకు నేతన్నలకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.

చేసింది కొంతేనని, చేయాల్సింది ఇంకెంతో ఉందన్నారు. నేతన్నల నైపుణ్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన వస్త్రపరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్తానన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు రూ.4.30 కోట్లతో ఎనిమిది అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. పేదలకు రూ.5 భోజనం అందించే అన్నపూర్ణ, వైకుంఠధామం, ఇందిరాపార్క్, ఏకలవ్య కమ్యూనిటీ భవనం, ఓపెన్‌ జిమ్, తడి, పొడి చెత్తను సేకరించేందుకు బ్యాటరీతో నడిచే వాహనాలు, స్త్రీనిధి మహిళలకు ట్యాబ్‌లు, బతుకమ్మ ఘాట్‌ వద్ద మ్యూజికల్‌ ఫౌంటేన్‌ను ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు