చారిటీ సిస్టర్స్‌ ..

14 Jun, 2019 08:50 IST|Sakshi
ప్రగ్యా నగోరి , మృధు నగోరి ,శ్రీ సరస్వతి హైస్కూల్‌లో వాటర్‌ ప్యూరిఫైయర్‌ని అందిస్తున్న మృధు

సాక్షి, సిటీబ్యూరో: వారిద్దరూ అక్కా చెల్లెళ్లు. పేరు ప్రగ్యా నగోరి, మృధు నగోరి. తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకోవాలని ఉన్నా అక్కడి పరిస్థితులు చూసి అందులో అడుగుపెట్టడానికి భయపడేవారు.  అదే సమయంలో అక్కడి అపరిశుభ్రతలో ఆడుకునే స్థానిక పిల్లలను చూసి కూడా ఆందోళన చెందేవారు. ఓ చారిటీ సంస్థ గొడుగు కిందకు చేరినవీరిద్దరూ సంస్థ తమకు అప్పగించిన ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకు తమ ఇంటి ముందున్న సమస్యనే ఎంచుకున్నారు. ఇంకా ఓటు హక్కు కూడా రాని ఈ లిటిల్‌ సిస్టర్స్‌ సామాజిక సేవను తమ భుజాలపై
వేసుకున్నారు.  

పరిశుభ్రత కోసం తొలి అడుగు  
బంజారాహిల్స్‌లోని గౌరీశంకర్‌ కాలనీకి సమీపంలో నివసించే 12వ తరగతి విద్యార్థిని ప్రగ్యా నగోరి, ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌లో 11వ తరగతి చదివే ఆమె సోదరి మృధు నగోరి ఇద్దరికీ తమ ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో ఆడుకోవాలని ఉండేది. కానీ అది అత్యంత దయనీయ స్థితిలో ఉంది. దాన్ని సమూలంగా మార్చాలంటే ఏం చేయాలని ఆలోచించేవారు. అందుకు వారికి ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించే ‘జూనియర్‌ జేసీఐ బంజారా’తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. దీన్ని ఉపయోగించుకున్న వీరిద్దరూ ఆ ఖాళీ స్థలం పరిశుభ్రంగా మార్చేందుకు పూనుకున్నారు. స్థానికులు, ప్రభుత్వ అధికారుల సహకారంతో దిగ్విజయంగా దీన్ని పూర్తి చేశారు. అదే స్థలంలో మొక్కలు నాటారు. వర్షాకాలంలో మొలకెత్తే విధంగా విత్తనాలు చల్లారు. అంతేకాదు నాటిన మొక్కల్ని కాపాడేందుకు, అక్కడి బస్తీ పిల్లలు వారి కుటుంబాలతో 10 మందికి ఓ మొక్క చొప్పున పరిరక్షిస్తామని మాట తీసుకున్నారు.  

‘సాఫ్‌ హైదరాబాద్‌’లో భాగం..
తొలి విజయం అందించిన ఉత్తేజంతో ప్రగ్యా నగోరి, మృధు నగోరి మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత ఏడు రోజులుగా బస్తీ పిల్లల కోసం విభిన్న రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 2000 లేబుల్స్‌ని 500 మంది చిన్నారులకు పంపిణీ చేశారు. ఉదయ్‌నగర్‌లోని శ్రీ సరస్వతి హైస్కూల్‌ ప్రైమరీ సెక్షన్‌లోని 350 మంది పిల్లలకు ఉపయోగపడేలా వాటర్‌ ప్యూరిఫైర్‌ని ఉచితంగా అందించారు. అలాగే పిల్లకు నీటి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ‘మన హైదరాబాద్, స్వచ్ఛ హైదరాబాద్, సాఫ్‌ హైదరాబాద్, షాందార్‌ హైదరాబాద్‌’ ఉద్యమంలో పిల్లను భాగస్వామలను చేసేందుకు ఆ పిల్లలతోనే స్లోగన్స్‌ ప్లకార్డులను తయారు చేసి ప్రదర్శించేలా ప్రోత్సహించారు. తాము ఎక్కడ చదివినా, ఎంత ఎదిగినా ఈ తరహా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని, తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలం పరిశుభ్రంగా చేయడం ఆనందంగా ఉందంటున్నారు ఈ సిస్టర్స్‌. 

మరిన్ని వార్తలు