డ్రగ్స్‌కేసులో మరో కీలక అడుగు..

4 Jan, 2018 11:11 IST|Sakshi

చార్జిషీట్లు దాఖలు చేయనున్న సిట్

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంతో పాటు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌కేసులో మరో కీలక అడుగు పడింది. దర్యాప్తుకు సంబంధించిన చార్జిషీట్లు దాఖలు చేయడానికి సిట్‌ బృందం రంగం సిద్ధం చేస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా భాగ్య నగరానికి  మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న డ్రగ్స్ రాకెట్ను తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ గుట్టు రట్టుచేసిన సంగతి తెలిసిందే. ఈకేసుకు సంబంధించి సంబంధించి సిట్ మొత్తం 12 కేసులు నమోదుచేసింది. వీటిలో 5 కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు సిట్ బృందానికి అందాయి. కొకైన్‌కు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. వీటితో కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేయనున్నట్లు సిట్ తెలిపింది. ఈ నెల 8న మూడు కేసులు, 12న మరో రెండు కేసులపై చార్జిషీట్లు దాఖలు చేసే అవకాశం ఉంది.

డ్రగ్స్‌కేసుల విచారణలో భాగంగా సిట్ బృందం 22 మందిని అరెస్టుచేసింది. వారి కాల్‌డేటా ఆధారంగా సినీరంగానికి చెందిన 12 మందికి ప్రముఖులకు నోటీసులు జారీచేసింది. వారందరినీ విచారించిన సిట్ బృందం దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ నుంచి గోళ్లు, వెంట్రుకలు, రక్తనమూనాలను సేకరించింది. అయితే అంతకు ముందుగానే అరెస్టుచేసిన మరో 22 మంది నుంచి కూడా సిట్ నమూనాలను సేకరించింది. సినీరంగానికి చెందిన ఇద్దరు కలిపి మెత్తం 24 మంది నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించింది. అప్పటి నుంచి దీనిపై పరీక్షలు జరిపిన ఫోరెన్సిక్ అధికారులు తాజాగా 5 కేసుల రిపోర్టులను కోర్టుకు అందించింది. కోర్టునుంచి నివేదికలు పొందిన సిట్ బృందం చార్జిషీట్లు నమోదుచేసే పనిలో నిమగ్నమైంది.

డ్రగ్స్ కేసులో సాక్ష్యాధారాల సేకరణ పూర్తైందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. దొరికిన లింకుల ఆధారంగా సాక్ష్యాలను సేకరించి నిందితులకు శిక్షపడేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నట్టు ఆయన తెలిపారు. నిందితులిచ్చిన వాంగ్మూలాలు, సిట్ అధికారుల వద్ద ఉన్న సాక్ష్యాలను క్రోడీకరించి కేసు దర్యాప్తు చేసినట్టు వివరించారు. ఈ కేసులో నిందితులు కెల్విన్, మైక్ కమింగలతో పాటు పలువురి నుంచి ఆధారాలను సేకరించామని చెప్పారు.

మరిన్ని వార్తలు