రామయ్య పెళ్లికి రండి

16 Nov, 2019 08:42 IST|Sakshi
ఆలయంలో ఉత్సవమూర్తులు 

రెండో భద్రాద్రిగా పేరొందిన జీడికల్‌ ఆలయం

విరాజిల్లుతున్న వీరాచల రామచంద్రస్వామి

రేపే సీతారాముల కల్యాణోత్సవం    

సాక్షి, లింగాలఘణపురం(వరంగల్‌) : భద్రాచల రామాలయం రాముడి ప్రేమకు గుర్తయితే జీడికల్‌ వీరాచలం ఆయన వీరత్వానికి ప్రతీతిగా భక్తులు చెప్పుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి జీడికల్‌ పున్నమిగా పేరు ప్రఖ్యాతులు గడించిం దంటే ఎంత ప్రాశస్త్యం కలిగిన జాతరో అర్థమౌతుంది. త్రేతాయుగంలో స్వయంభువుగా వెలసిన వీరాచల రామచంద్రస్వామి ఖమ్మం జిల్లా భద్రాచలం తర్వాత రెండో భద్రాద్రిగా పేరు ప్రఖ్యాతులు పొందింది. కార్తీక మాసంలో ప్రారంభమైన జాతర నెల రోజుల పాటు జరుగుతుంది. ప్రతి ఏటా శ్రీరామనవమితో పాటు, కార్తీకమాస పునర్వసు నక్షత్రంలో సీతారాముల కల్యాణోత్సవం జరుపడం ఇక్కడి విశేషం. ఈ జాతరకు రాష్ట్రంలోని అన్ని ప్రాం తాలతో పాటు మహరాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుం టారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జీడికల్‌ రామచంద్రస్వామి పేరుతో 11 ఎకరాల భూమి ఉండడం జాతర ప్రాముఖ్యతకు నిదర్శనం.

విద్యుత్‌ వెలుగుల్లో ఆలయం 
జీడికల్‌ వీరాచల రామచంద్రస్వామి ఆలయం విద్యుత్‌ వెలుగులతో జిగేల్‌మంటోంది. ఈ నెల 11న ప్రారంభమైన జాతరలో 17న సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ లైట్లతో సీతారామలక్ష్మణుల ప్రతిమలు వెలుగొందుతున్నాయి. గోపురంతో పాటు ఆలయం చుట్టూ విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవ వేదిక వద్ద చలువ పందిళ్లు వేశారు. ఆలయ సిబ్బంది అంతా భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లలో మునిగిపోయారు. దాతల విరాళాలతో ఆలయం, సత్రాలు, కల్యాణ వేదిక ముందు రేకులతో షెడ్లు వేశారు. కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి సీజీఎఫ్‌ నిధులు సుమారుగా రూ.25లక్షలతో షెడ్లు, నీటి వసతి కల్పించారు. శశాంక అనే ఎన్‌ఆర్‌ఐ కల్యాణ వేదిక వద్ద షెడ్‌ వేశారు.

 
జీడిగుండం, పాలగుండం 

జీడిగుండం, పాలగుండాలు.. 
ఆలయంపైన జీడిగుండం, పాలగుండం రెండు ఉంటాయి. పూర్వకాలంలో భీమసేనుడు, చంద్రసేనుడు అనే ఇద్దరు రాజుల యుద్ధంలో చంద్రసేనుడు వీరమరణం పొందుతాడు. అతడి కవల పిల్లలైన బాలచంద్రుడు, బాలచంద్రికలు వేర్వేరుగా ఇతర ప్రాంతాల్లో పెరిగిపెద్దవుతారు. స్వయంవరంలో వీరిద్దరు అన్నచెల్లెల్లు అని తెలియక వివాహం చేసుకోవడంతో ఒక్కసారిగా వీరి శరీరాలు నల్లబడిపోయాయి. వెంటనే ఆకాశగంగ పలుకుతూ 101 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని చెప్పడంతో వీరిద్దరు పాప విమోచనానికి ఆలయాలన్ని దర్శించుకొని చివరిగా జీడికల్‌లోని జీడిగుండం, పాలగుండాలలో స్నానాలు చేయగా శరీరాలు యథావిధిగా మారుతాయి. ఇలా ఇక్కడే పాప విమోచనం జరిగిందని ప్రతీతి. భక్తులు ఈ గుండాల్లో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని నమ్మకం.

ఆలయ చరిత్ర..
త్రేతాయుగంలో వీరుడు, భద్రుడు ఇద్దరు మునీశ్వరుల తపోనిష్టతో భద్రాచలంలో భద్రాచల రామయ్య, జీడికల్‌లో వీరాచల రామచంద్రుడిగా వెలిసినట్లు ప్రతీతి. అందుకే రెండో భద్రాద్రిగా పేరు పొందింది. రాముడు వనవాసం చేసే సమయంలో పర్ణశాలలో ఉన్న సీతమ్మకు మాయ లేడి కనిపించడంతో ఆ లేడి సంహారానికి రాముడు అక్కడి నుంచి బయలు దేరి వెంటాడుతూ వేటాడుతూ జీడికల్‌ సమీపంలోని లేడిబండ వద్ద సంహరించినట్లుగా చెబుతారు. ఇప్పటికీ అక్కడ శ్రీరామచంద్రుడు లేడీ సంహార అనంతరం సంధ్యావందనం కోసం తన బొటన వేలిని నొక్కగా బండపై ఏర్పడిన గుంతలో నీరు వచ్చిందని ప్రతీతి. ఇప్పటివరకు దాన్ని లేడి బండగా పిలుస్తారు. సంధ్యావందనం అనంతరం వీరుడి ఘోర తపస్సుతో రామనామ జపం వినిపించడంతో అటుగా అడుగులు వేస్తూ రాగా కొద్ది దూరంలో వీరుడి తపస్సును చూసి మెచ్చుకొని ఏం కావాలని కోరుకోమనగా సూర్యచంద్రాదులు ఉన్నంతవరకు నీ సేవ చేసుకొనే భాగ్యం కల్పించాలని వేడుకోగా అక్కడే స్వయంభువుగా వెలిసినట్లు చెబుతారు. 

కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 17న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన వసతులు ఏర్పాట్లు చేశాం. కల్యాణంలో పాల్గొనే దంపతులు రూ.1516 చెల్లించి రశీదు తీసుకొని కల్యాణం జరిపించే అవకాశం పొందవచ్చు.
– శేషుభారతి, ఈఓ జీడికల్‌

మరిన్ని వార్తలు