కుదుటపడుతున్న భైంసా

18 Jan, 2020 11:34 IST|Sakshi

తెరుచుకున్న దుకాణాలు

బందోబస్తు పటిష్టం చేసిన పోలీసులు

ప్రారంభమైన ఎన్నికల ప్రచారం

సాక్షి, భైంసా(ఆదిలాబాద్‌) : అల్లర్ల అనంతరం భైంసాలో పరిస్థితి క్రమంగా కుదుటపడుతోంది. పట్టణంలో వ్యాపార సముదాయాలు శుక్రవారం తెరుచుకున్నాయి. అయితే గిరాకీలు అంతంత మాత్రంగానే కనిపించాయి. పాత పట్టణంలో రోడ్లు మాత్రం నిర్మానుష్యంగానే దర్శనమిచ్చాయి. ఇళ్లకు తాళాలువేసి బంధువుల ఇళ్లకు వెళ్లిన స్థానికులు ఇంకా తిరిగిరాలేదు. కోర్భాగల్లీ, ఖాజీగల్లీ, గుజిరిగల్లీ, కుంట ఏరియా, నయాబాది ప్రాంతాల్లో జనసందడి కనిపించలేదు. 

బందోబస్తు ముమ్మరం...
సుమారు 1000 మందితో పోలీసులు బందోబస్తు మరింత పటిష్టం చేశారు. పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ ర్యాపిడ్‌యాక్షన్‌ ఫోర్స్, ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్, కర్ఫ్యూ ఎత్తివేసినా పట్టణంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

ప్రత్యేక చెక్‌ పోస్టులు..
భైంసా నుంచి పలు ప్రాంతాలకు (భైంసా–భోకర్, భైంసా–కుభీర్, భైంసా–పార్డి(బి), భైంసా–నిర్మల్‌కు) వెళ్లే ప్రధాన కూడళ్లలో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పట్టణానికి వెళ్లే అన్ని మార్గాల్లోనూ నిఘా పటిష్టం చేశారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాకే బయటకు వదులుతున్నారు. వాటి నంబర్లను నమోదు చేస్తున్నారు. అలాగే బస్టాండ్, ఏరియా ఆసుపత్రి, గాంధీగంజ్, కుభీర్‌ చౌరస్తా, నిర్మల్‌ చౌరస్తా, ఏపీ నగర్, పాత చెక్‌పోస్టు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్‌ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. శుక్రవారం పట్టణంలో ఇంటర్‌నెట్‌ సేవలను పునరుద్ధరించారు. 

ప్రారంభమైన ప్రచారం..
పట్టణంలో ఎట్టకేలకు మున్సిపల్‌ అభ్యర్థుల ప్రచారం ప్రారంభమైంది. ఈనెల 22న పోలింగ్‌ నేపథ్యంలో ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి సైతం అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారం చేపడుతున్నారు. మున్సిపల్‌ ప్రత్యేక అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఆర్‌డీఓ రాజు ఎన్నికల ఏర్పాట్లు చేపడుతున్నారు. ఎన్నికలు జరుగనున్న 23 వార్డుల్లో బరిలో ఉన్న 85 మంది అభ్యర్థులకు సంబంధించిన గుర్తులను కేటాయించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.   

భైంసాలో అల్లర్ల ఘటన నేపథ్యంలో గత నాలుగు రోజుల నుంచి పట్టణానికి ప్రజల రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆదివారం రాత్రి ఘటన జరుగగా, సోమవారం సైతం కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆర్‌ఏఎఫ్‌ బలగాలతోపాటు, ప్రత్యేక పోలీసు బలగాలు భైంసాకు చేరుకున్నాయి. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రధాన వీధుల్లో కవాతులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు ఇప్పుడిప్పుడే ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. శుక్రవారం పట్టణంలో పలు దుకాణాలు తెరుచుకోవడంతో, చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాల రాక పెరిగింది. బస్టాండ్‌ ప్రయాణికులతో నిండింది.    

మరిన్ని వార్తలు