తెలంగాణలో కరోనాతో ఆరుగురు మృతి

30 Mar, 2020 23:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ బారినపడి తెలంగాణలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్ లో, ఒకరు గద్వాలలో మరణించారు. వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు పేర్కొంది.

బాధితులను కలుసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నామని ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో పేర్కొంది. మృతుల కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మృతుల కుటుంబ సభ్యులు వైద్య బృందాలకు సహకరించాలని.. మర్కజ్‌ వెళ్లినవారంతా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని.. ఎవరికైనా సమాచారం తెలిస్తే ప్రభుత్వానికి చెప్పాలని వైద్య, ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.


 

మరిన్ని వార్తలు