ఇంటర్‌లో ఫెయిల్‌.. ఆరుగురి ఆత్మహత్య..!

19 Apr, 2019 16:14 IST|Sakshi

క్షణీకావేశంతో ప్రాణాలు తీసుకుంటున్న ఇంటర్‌ విద్యార్థులు

పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకు ఆత్మహత్య

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఫలితాలు విడుదలైన అనంతరం మనస్తాపనికి గురై పిట్టల్లా రాలిపోతున్నారు. మరోసారి పరీక్షలు రాసే అవకాశాలు ఉన్నా..  ఆలోచించకుండా క్షణీకావేశంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుులు తిడతారని ..స్నేహితుల వద్ద తలెత్తుకులేమని.. సమాజంలో పరువు పోతుంది ఇలా ఏదో కారణంతో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల బలవన్మరణాలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్య ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల వివరాలు

  • రాచకొండ కమిషనరేట్‌ కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య.
  • ఇదే పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఇంటర్‌ మొదటి ఏడాది చదవుతున్న విద్యార్థి నాగేందర్‌ ఫెయిల్‌ అయిన మనస్తానంతో ఆత్మహత్య.
  • హైదరాబాద్‌ గాంధీనగర్‌ సమీపంలో కోఠిలోని ప్రగతి కళాశాలలో చదువుతున్న అనమిక ఇంటర్‌లో ఒక్క సబ్జెక్ట్‌ ఫెయిల్‌ కావడంతో ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య.
  • ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకు తీవ్ర మనస్తానం చెందిన బోధన్‌ విద్యార్థిని వెన్నెల ఆత్మహత్య.
  • వరంగల్‌లో ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థి భానుకిరణ్‌ రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నారు.
  • మారేడ్‌పల్లిలో ఇంటర్ విద్యార్థిని లాస్య ఆత్మహత్య.

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులకు మరో అవకాశం ఉంటుంది. సప్లిమెంటరీలు రాసి మళ్లీ పాస్ కావచ్చు. గత పరీక్షల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. అవగహనలేమితో  ఇవేమీ ఆలోచించకుండా క్షణికావేశంలో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోత మిగలుత్చుతున్నారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భావి పౌరులు జీవితం మధ్యలోనే తనువు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు నిన్న సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు