రెప్పపాటులో నెత్తురోడిన రహదారి

10 Feb, 2015 23:31 IST|Sakshi
రెప్పపాటులో నెత్తురోడిన రహదారి

లారీ, ఆటో ఢీకొనడంతో దారుణం
ఆరుగురు దుర్మరణం
ముగ్గురికి గాయాలు
ఐదు నిమిషాలైతే గమ్యానికి..
చెల్లాచెదురుగా మృతదేహాలు
లారీ డ్రైవర్‌కు దేహశుద్ధి
ఘట నా స్థలాన్ని సందర్శించిన కలెక్టర్
ఆసుపత్రిలో మిన్నంటిన రోదనలు
ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి

 
రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది.. మరో ఐదు నిమిషాలు గడిస్తే వారంతా క్షేమంగా గమ్యస్థానానికి చేరే వారు...ఈ లోగానే ఓ పెద్ద కుదుపు. మృత్యుశకటం రూపంలో వచ్చిన లారీ ఆటోను ఢీకొంది.  క్షణాల్లో చుట్టూ చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు... రక్తమోడిన రోడ్డు.. ఆరుగురు దుర్మరణం.. ముగ్గురికి గాయాలు.. అక్కడి భీతావహ దృశ్యాలు ప్రతిఒక్కరిని కంటతడిపెట్టించింది. ఆగ్రహించిన జనం లారీ డ్రైవర్‌ను చితక బాదారు.
 
సంగారెడ్డి, క్రైం : సంగారెడ్డి మండలం కంది సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం లారీ- ఆటో ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు. పుల్కల్ మండలం శివ్వంపేటకు చెందిన బుర్ర నిరూప(35), బుర్ర నవీన్‌కుమార్ చనిపోయారు. వీరు స్వయాన వదిన మరిది. అశోక్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం నిరూప తన మరిది బుర్ర నవీన్‌కుమార్(28)తో కలిసి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో వీరద్దరు పటాన్‌చెరులో స్టీరింగ్ ఆటో ఎక్కారు. సదాశివపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన (ప్రస్తుత నివాసం కవలంపేట) ప్రకాష్‌గౌడ్(28), రామచంద్రాపురం మండలం బండ్లగూడకు చెందిన రెడ్డిపల్లి యాదమ్మ(35), పటాన్‌చెరు పట్టణం అంబే ద్కర్ కాలనీకి చెందిన అక్కా చెల్లెళ్లు దుర్గమ్మ, సావిత్రి కూడా ఇదే ఆటోలో పయనమయ్యా రు.

ఈ ఆటో సంగారెడ్డి సమీపంలోని కంది గ్రామ శివారుకు చేరుకున్న క్రమంలో  వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఆటోను ఢీకొంది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఒకరు ఆసుపత్రిలో మరణించారు. మరో ముగ్గురు గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బండ్లగూడకు చెందిన రెడ్డిపల్లి యాదమ్మ వద్ద సంగారెడ్డిలోని మణప్పురం గోల్డ్ లోన్‌కు సంబంధించిన పత్రాలు లభించాయి. ప్రకాష్‌కుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా కవలంపేటలో నివాసముంటున్నాడు.

ప్రయాణికుల ఆగ్రహం..

ప్రమాద స్థలంలో రహదారి వెంట వె ళ్లే ప్రయాణికులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడివుండటంతో వారంతా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ కె.మురహరిని చితకబాదారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

మిన్నంటిన రోదనలు

జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద మృతులు కుటుం బీకుల రోదనలు మిన్నంటాయి. పుల్కల్ మండలం శివ్వంపేటకు చెందిన బుర్ర నిరూప, నవీన్‌కుమార్‌లు ఒకే కుటుంబానికి చెందిన వారు (వదిన, మరిది) కావడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలిచ్చారు. మృతురాలు నిరూప భర్త రామలింగం సంగారెడ్డిలోని డ్వామా కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండటంతో సహచర ఉద్యోగులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఘటనా స్థలాన్ని సందర్శించిన కలెక్టర్..

విషయం తెలుసుకున్న కలెక్టర్ రాహుల్ బొజ్జా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆయనతోపాటు సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న, ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, తహశీల్దార్ గోవర్ధన్, సీఐలు శ్యామల వెంకటేష్, ఎస్.ఆంజనేయులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఆరు మృతదేహాలకు బుధవారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు