వడదెబ్బతో ఆరుగురి మృతి

29 May, 2015 00:56 IST|Sakshi

పెదనాన్న మృతితో ఆగిన కుమారుడి పెళ్లి
 కందుకూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం వడదెబ్బకు గురై ఆరుగురు మృతిచెందారు. మహేశ్వరం మండల పరిధిలో.. మంఖాల్‌కు చెందిన బైరాములు(60) తన తమ్ముడి కుమారుడి వివాహానికి పందిరి వేసే నిమిత్తం బుధవారం గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి మర్రికొమ్మల కోసం వెళ్లాడు. సాయంత్రం ఆయన ఇంటికి చేరుకున్నాడు. వడదెబ్బకు గురైన బైరాములు తీవ్ర అస్వస్థతకు గురై రాత్రి 10 గంటలకు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఓ కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనపై వీఆర్వో రాములు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. బైరాములు మృతితో గురువారం జరగాల్సిన అతడి తమ్ముడి కుమారుడి వివాహ ం ఆగిపోయిందని గ్రామస్తులు తెలిపారు.  
 
 చేవెళ్లలో యాచకుడు..
 అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్న స్థానిక యువకులు
 చేవెళ్ల రూరల్: మండల కేంద్రంలో మతిస్థిమితంలేని ఓ యాచకుడు వడదెబ్బతో మృతిచెం దాడు. స్థానిక యు వకులు అతడి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కొన్నేళ్ల క్రితం చేవెళ్లకు వచ్చిన యాదగిరి అలియాస్ యాది(50) యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండల కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయం, అయ్యప్ప దేవాలయం వద్ద ఉంటుండేవాడు. కొంతకాలం క్రితం యాదగిరికి మతిస్థిమితం కోల్పోయింది. ఇటీవల మండుతున్న ఎండలకు అతడు వడదెబ్బకు గురయ్యాడు. ఈక్రమంలో గురువారం ఆయన గురువారం అయ్యప్ప ఆలయం సమీపంలో కుప్పకూలిపడిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే అతడు మృతి చెందాడు. స్థానిక యువజన సంఘం సభ్యులు ఎం. యాదగిరి, బి. నర్సింలు, చింటు, జంగయ్య, శ్రీను, బాలాజి, అంజయ్య, రవి, సత్తయ్య తదితరులు యాచకుడి అంత్యక్రియలు నిర్వహించేందుకు మానవత్వంతో ముందుకు వచ్చారు. ఆస్పత్రి నుంచి యాదగిరి డప్పులతో ఆటోలో శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు.  
 
 షాబాద్‌లో యువకుడు..
 షాబాద్: వడదెబ్బతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. షాబాద్ గ్రామానికి చెందిన లింగాల రవికుమార్(25) ఉదయం ఇంటి వద్ద ఉండగా ఎండదెబ్బకు గురై కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే అతడు మృతిచెందాడు. కాగా, మండలంలో వడదెబ్బకు గురై ఇటీవల ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. యువకుడి మృతితో కుటుంబీకులు కన్నీటిపర్యం తమయ్యారు. అధికారులు రవికుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు.
 
 సెంట్రింగ్ కార్మికుడు..
 మేడ్చల్: మండల పరిధిలోని ఘనాపూర్‌లో వడదెబ్బకు గురై ఓ సెంట్రింగ్ కార్మికుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏర్పుల వెంకటేష్ (39) స్థానికంగా సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల ఎండల్లో పని చేయడంతో ఆయన రెండు రోజులుగా ఆస్వస్థతకు గురయ్యాడు. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి ఆయన తన ఇంట్లో మృతిచెందాడు.  
 
 మరో ఘటనలో..
 కుల్కచర్ల: కుల్కచర్ల మండలకేం ద్రానికి చెందిన మేకుల లక్ష్మయ్య(49) కొంతకాలంగా తన భార్యతో కలిసి చేవెళ్ల సమీపం లో కూలీపనులు చేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఆయన బుధవారం సాయంత్రం వడదెబ్బకు గురై అస్వస్థకు గురయ్యాడు. దీంతో ఆయన అక్కడే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అదేరోజు రాత్రి లక్ష్మయ్య స్వగ్రామానికి చేరుకున్నారు. అర్ధరాత్రి నిద్రలేచిన ఆయన నీళ్లు తాగి తిరిగి పడుకున్నాడు. గురువారం ఉదయం కుటుంబీకులు చూడగా లక్ష్మయ్య మృతిచెందాడు.
 
 బాకారంలో..
 మొయినాబాద్: మండల పరిధిలోని బాకారం గ్రామానికి చెందిన కొండలకల్ల పెద్ద యాదయ్య(55) మాజీ వార్డు సభ్యుడు. బుధవారం ఆయన బంధువుల పెళ్లికి వెళ్లాడు. వడదెబ్బకు గురైన ఆయన రాత్రి ఇంటికి వచ్చి నీళ్లుతాగి నిద్రకు ఉపక్రమించాడు. గురువారం ఉదయం కుటుంబీకులు చూడ గా అప్పటికే మృతిచెందాడు. పెద్ద యాదయ్యకు భార్య నీలమ్మ, ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు.
 

మరిన్ని వార్తలు